
న్యూఢిల్లీ: మహాకూటమిని విడిచిపెట్టి బీజేపీకి దగ్గరైన బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌కు ఊహించని షాక్ తగిలింది. జేడీయూ కేరళ అధ్యక్షుడు ఎంపీ వీరేంద్ర కుమార్ బుధవారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ వ్యవస్థాపకుడు శరద్ యాదవ్, అలీ అన్వర్‌లను రాజ్యసభ సభ్యత్వాలను రద్దు చేసిన కొద్దిరోజులకే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడికి సమర్పించినట్టు 80 ఏళ్ల వీరేంద్ర కుమార్ మీడియాతో చెప్పారు. బీజేపీతో నితీశ్ చేతులు కలిపినందునే రాజ్యసభ్య సభ్యత్వాన్ని వదులుకున్నట్టు ఆయన వెల్లడించారు.
‘నితీశ్ కుమార్ పార్టీకి చెందిన సభ్యుడిగా నిబంధనల ప్రకారం రాజ్యసభలో నేను జేడీయూ ఎంపీలతో పాటు కూర్చోవలసి వస్తోంది. నితీశ్ కుమార్ ఇప్పుడు సంఘ్ పరివార్ అజెండాను అనుసరిస్తున్నారు. దీన్ని నేను ఆమోదించలేకపోతున్నాను. కేరళలో సోషలిస్ట్ జనతా డెమొక్రాటిక్(ఎస్‌జేడీ) కూటమిలో భాగస్వామిగా ఉండగా గతేడాది నాకు రాజ్యసభ సీటు దక్కింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌లో ఎస్‌జేడీ భాగస్వామి. కానీ నేను రాజ్యసభకు ఎన్నికైన తర్వాత జేడీయూలో ఎస్‌జేడీ విలీనమైంది. మరోవైపు నితీశ్ కుమార్.. సంఘ్ పరివార్, బీజేపీతో చేతులు కలిపారు. ఆయనకు దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాను. భవిష్యత్ కార్యాచరణ గురించి శరద్ యాదవ్, నా మద్దతుదారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాన’ని వీరేంద్ర కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment