సాక్షి, బెంగళూరు:చాలా రోజుల నిరీక్షణ అనంతరం జేడీఎస్ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. వచ్చే నెల 12వ తేదీ జరిగే ఎన్నికల్లో పోటీ చేయబోయే తమ అభ్యర్థుల పేర్లను శుక్రవారం సాయంత్రం నగరంలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వెల్లడించింది. మొత్తం 56 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను పార్టీ అధిష్టానం సిద్ధం చేసి విడుదల చేసింది. ఈ జాబితాలో బీజేపీ, కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన వారికి పెద్దపీట వేశారు. కాంగ్రెస్, బీజేపీలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలకు జేడీఎస్ గాలం వేసి పోటీలో దింపేందుకు సిద్ధం చేసింది. టికెట్ పొందిన వారిలో ప్రకాశ్ ఖండ్రె∙(భాల్కి), నటుడు శశికుమార్ (హొసదుర్గ), హేమచంద్రసాగర్ (చిక్కపేటె), పి.రమేశ్ (సీవీ రామన్‌నగర్), మంగళదేవి బిరాదార్ (ముద్దేబిహాళ్), రామచంద్ర(రాజరాజేశ్వరినగర) ఉన్నారు. గత ఫిబ్రవరిలో 126 మంది అభ్యర్థులతో జేడీఎస్ తన తొలిజాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీ నుంచి టికెట్ దక్కక వలస వచ్చే వారి కోసం ఇంతకాలం ఆలస్యం చేసింది. జేడీఎస్ గత (2013) ఎన్నికల్లో కూడా ఇదే వ్యూహం అనుసరించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల ఓట్లు రాబట్టేందుకు మాయవతి నేతృత్వంలోని బీఎస్పీతో పొత్తుపెట్టుకుంది. గతవారంలో ముస్లిం ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఏఐఎంఐఎం మద్దతు కోరింది. జేడీఎస్ ఇంకా 42 స్థానాలకు అభ్యర్థులను కేటాయించాల్సి ఉంది.
బీజేపీ మూడో జాబితా విడుదల
సాక్షి, బెంగళూరు: నామినేషన్లు ప్రారంభమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ తన మూడో జాబితాను విడుదల చేయకుండా ఆలస్యం చేస్తూ వచ్చింది. ఈనేపథ్యంలో శుక్రవారం సాయంత్రం మొత్తం 59 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను పార్టీ కార్యాలయంలో విడుదల చేసింది. సిద్ధరామయ్య పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి గోపాల్‌రావును తమ అభ్యర్థిగా ప్రకటించింది. అంతేకాకుండా కోలార్ కేజీఎఫ్ స్థానంలో మార్పు చేసి ఎస్.అశ్వినికి కేటాయించింది. గాలి జనార్ధన్‌రెడ్డి సోదరుడు కరుణాకర్‌రెడ్డికి కూడా హరప్పనహళ్లి టికెట్ కేటాయించింది. గాంధీనగర నియోజకవర్గ స్థానాన్ని బీజేపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు సప్తగిరి గౌడకు టికెట్ కేటాయించింది. మండ్య నుంచి కాంగ్రెస్ నేత అంబరీష్‌కు పోటీగా బసవేగౌడను బరిలో దింపనుంది. కాగా బీజేపీ ఇంకా 11 స్థానాలకు అభ్యర్థులను కేటాయించాల్సి ఉంది. అందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు విజయేంద్ర పోటీ చేస్తారని ప్రచారంలో ఉన్న వరుణ నియోజకవర్గానికి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.
Comments
Please login to add a commentAdd a comment