
సాక్షి, జగిత్యాల: సాక్షి, జగిత్యాల: ‘రాష్ట్ర అభివృద్ధి నిధుల (ఎస్‌డీఎఫ్) పేరిట సీఎం దగ్గర రూ. 2వేల కోట్ల ప్రత్యేక నిధులుంటాయి.. సందర్భం, అవసరాన్ని బట్టి ఆయన మంజూరు చేస్తారు. ఇప్పటివరకు సిరిసిల్ల, వేములవాడ, హుస్నాబాద్.. మిగతా నియోజకవర్గాలన్నింటీకి ఆ నిధులు వచ్చాయి. కేవలం జగిత్యాలకు తప్ప. ముఖ్యమంత్రి ముద్దుల కూతురా.. అన్న దగ్గర రూ. 20 కోట్లో.. రూ.30 కోట్లో తెచ్చి సీసీ రోడ్లో.. సామూహిక భవనాలో నిర్మించు’అని జగిత్యాల తాజా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి నిజామాబాద్ ఎంపీ కవితను డిమాండ్ చేశారు. గురువారం ఆయన జగిత్యాలలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ, జగిత్యాల నియోజకవర్గంలో రూ. 800 కోట్లు ఖర్చు ఎక్కడ పెట్టారో తెలియడం లేదన్నారు. ఏ ప్రాతిపదికన జగిత్యాల మున్సిపాలిటీకి రూ. 50 కోట్లు కేటాయించారని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.
సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీ కోరుట్ల.. మూడో గ్రేడ్ మున్సిపాలిటీ మెట్‌పల్లికీ రూ.50 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటికీ అదే ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. లక్ష్మీపూర్‌లో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు శంకుస్థాపన జరిగి ఆరుమాసాలైనా టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాలేదన్నారు. ప్రైవేట్ యాజమాన్యంలో కొనసాగుతున్న ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వంద రోజుల్లో ప్రభుత్వ పరం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన టీఆర్‌ఎస్ పార్టీ దాన్ని మూసేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన విద్యుత్ ప్రాజెక్టులు తప్ప నాలుగేళ్లలో అదనంగా ఒక్క యూనిట్‌ను ఆరంభించారా..? అని ప్రశ్నించారు. 2014 ఎన్నికలే తన చివరి పోటీ అని ఏనాడూ చెప్పలేదని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. నాటి ఎన్నికల ప్రచారంలో తాను మళ్లీ ఎన్నికలు చూస్తానో..? లేదో? అని మాత్రమే చెప్పానన్నారు. దేవుడి దయ.. ప్రజల దీవెనతో ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టే ఇప్పుడు మళ్లీ పోటీ చేస్తున్నానని చెప్పారు.
ప్రజలే తేలుస్తారు!
ఎవరి డీఎన్‌ఏలో ఏముందో త్వరలో జరిగే ఎన్నికల్లో ప్రజలే తేలుస్తారని జీవన్‌రెడ్డి, మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకులకు డీఎన్‌ఏ టెస్ట్ చేయాలని కేటీఆర్ వ్యాఖ్యానించడంపై ఆయన మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌లో అయితే కేసీఆర్ లేకుంటే కేటీఆర్.. ఇద్దరే ముఖ్యమంత్రులు అవుతారని, టీఆర్‌ఎస్ నియంతృత్వ, అరాచకపాలనకు ఇది నిదర్శనమని, అదే కాంగ్రెస్‌లో అన్నివర్గాల్లోంచి సీఎం పదవికి సమర్థులైన అభ్యర్థులు ఉన్నారని చెప్పారు. గురువారం జగిత్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మహాకూటమిలో 40 మందికి సీఎం పోస్టుకు అర్హత ఉందని కేటీఆర్ చెప్పడం హర్షణీయమన్నారు. అబద్ధాలాడటం కాంగ్రెస్ డీఎన్‌ఏలో ఉందని ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్య ల్ని జీవన్‌రెడ్డి ఖండించారు. ‘ఒకసారి పరీక్ష చేయిస్తే ఎవరి డీఎన్‌ఏలో డీఎన్‌ఏలో మోసాలున్నాయో తెలుస్తది’అని మండిపడ్డారు. దళితుడే తెలంగాణకు తొలి సీఎం అని ప్రకటించిన కేసీఆర్.. అన్నివర్గాలను మోసం చేసి గద్దెనెక్కారని విమర్శించారు. ముఖ్యమంత్రి అయ్యే యోగ్యత కడియం శ్రీహరికి లేదా అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment