సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన దళిత నాయకుడు జిగ్నేష్ మెవానీపై సోషల్ మీడియా శుక్రవారం నాడు దుమ్మెత్తి పోసింది. ‘జిగ్నేష్ మెవానీ దళిత అరాచకవాది, హిందువుల మధ్య చిచ్చు పెట్టడం వల్ల భారత్‌ను అస్థిరం చేయాలనుకుంటున్నారు. ఆయన టెర్రిరిస్టులకన్నా ప్రమాదకారి. ఆయన ఇంకెంత మాత్రం దళితుల ప్రతినిధి కాదు. బీఆర్ అంబేడ్కర్, మాయావతిలను ఎలా విమర్శించారో చూడండీ!.....అంబేడ్కర్, కాన్షీరామ్, మాయావతిలు తనకన్నా గొప్పవారు, మంచివారు కాదని జిగ్నేష్ మెవానీ అనుకుంటున్నారు, దళితులను ద్వేషిస్తున్నారు.
ముల్లాలను తప్ప అందర్ని ద్వేషించాల్సిందిగా కమ్యూనిస్టులు ఆయనకు నూరిపోసినట్టున్నారు..... జిగ్నేష్ మెవానీ కమ్యూనిస్టులకు, రాజదీప్ సర్దేశాయ్‌కి డార్లింగ్ కావచ్చు. ఎప్పుడయితే ఆయన అంబేడ్కర్‌ను తక్కువ చేసి మాట్లాడారో, కాన్షీరామ్, మాయావతి లాంటి వారిని కించపరిచారో ఉపేక్షించరాదు.....’ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దళితుల హక్కుల గురించి పోరాడుతున్న జిగ్నేష్ నిజంగా దళితులను కించ పరుస్తూ మాట్లాడారా? ఆయన మాట్లాడిన దానిలో దళితులకు, ఇతరులకు ఆగ్రహం తెప్పించిన అంశాలు ఏమున్నాయి?
ఆయన హైదరాబాద్‌లోని లామాకాన్‌లో దళితులు, కమ్యూనిస్టులకున్న సారూప్యత, ఏయే అంశాలపై ఇరువురు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు? ఎవరు ఏ అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు? దేశంలో కుల, వర్గ రహిత సమాజం ఏర్పడాలంటే ఇరువర్గాలు కలిసి పోరాటం సాగించాల్సిన అవసరం ఎంతుంది ? అన్న అంశాలపై దాదాపు 40 నిమిషాలు మాట్లాడారు. ఆయన మొత్తం ప్రసంగంలో ఎక్కడా దళిత ధ్రువ తారలనుగానీ, నాయకులనుగానీ కించపరుస్తూ మాట్లాడలేదు.
ఈ విషయం సోషల్ మీడియాలో ఎవరు ఎక్కువ ట్వీట్లు చేశారో గమనిస్తే మనకే అర్థం అవుతుంది. దళితుల కంటే ఇతరులే ఎక్కువగా దళితుల పక్షాన విమర్శలు చేశారు. దళితులకు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రసారం చేయడంలో ముందుండే కొన్ని ఆంగ్ల టీవీ ఛానళ్లయితే ఉన్నవి, లేనివి మాట్లాడుతున్నాయి. ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఎవరో కొందరు వ్యక్తులు జిగ్నేష్ మెవానీ ప్రసంగం వీడియోను తప్పుడు అర్థం వచ్చేలా అసంబద్ధంగా ఎడిట్ చేసి ప్రసారం చేయడం వల్ల ఈ రాద్ధాంతం జరుగుతోంది.
‘కుల, మత రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న వామపక్షాలు మనకు సహజమైన మిత్రులు. ఈ విషయాన్ని దళితులు అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో డాక్టర్ అంబేడ్కర్‌కు భిన్నమైన అభిప్రాయం ఉన్నాగానీ నా అభిప్రాయం మారదు. ముందు వర్గ రహిత సమాజం కోసం పోరాడితే కులం దానంతట అదే కనుమరుగవుతుందని, కాకపోతే ఆ తర్వాత కుల రహిత సమాజం కోసం పోరాడవచ్చన్నది కమ్యూనిస్టుల అభిప్రాయం.
కుల వివక్ష దారుణాలకు దగ్ధమవుతున్నందున ముందుగా కుల రహిత సమాజం కోసమే పోరాడాలన్నది అంబేడ్కర్‌వాదుల అభిప్రాయం. నా ఉద్దేశంలో కులం, వర్గం అనేవి ఒకదానికొకటి ముడివడిన అవిభాజ్య అంశాలు. వీటి నిర్మూలనకు ఒకేసారి పోరాటం ప్రారంభించాలి. ఇందుకోసం అవసరమైతే కమ్యూనిస్టులు ఓ పక్క, దళితులు ఓ పక్క కూర్చొని సుదీర్ఘ చర్చల ద్వారా ఓ కార్యాచరణకు రావాలి. ఈ రెండు వర్గాలు కలిసి పోరాడినప్పుడే భారత్‌లో కుల, వర్గ రహిత సమాజం ఏర్పడుతుంది’ అంటూ ఓ సందర్భంలో జిగ్నేష్ వ్యాఖ్యానించారు.
‘ఆల్టర్ న్యూస్ డాట్ కామ్’ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హాను ఓ వెబ్‌ఫ్లాట్ ఫామ్‌పై ‘ఆయనో సిన్హా’ అని ఓ దళితుడు విమర్శించిన సందర్భాన్ని జిగ్నేష్ ప్రస్తావిస్తూ ‘నేను ఓ దళిత కుటుంబంలో పుట్టటం నా తప్పు కానప్పుడు, సిన్హా ఆయన ఇంట్లో పుట్టడం మాత్రం ఆయన తప్పెలా అవుతుందీ? ఇదంతా చెత్త. ఇదంతా బ్రాహ్మణిజమే. బ్రాహ్మణుల్లో ఉండే మనువాది తత్వం అంబేద్కర్ వాదుల్లో కూడా ఇంకా ఇమిడి ఉండడం వల్ల ఇలాంటి విమర్శలొస్తున్నాయి. ఆ భావజాలం నుంచి మనమూ బయటపడాలి’ అన్నారు.
ఈ రెండు సందర్భాల్లోని మాటలనే కాకుండా ఇతర సందర్భాల్లోని ఆయన మాటలను తీసుకొని తప్పుడు అర్థం వచ్చేలా వీడియోను ఎడిట్ చేసి ఎవరో దురుద్దేశపూర్వకంగా సోషల్ మీడయాలో పోస్ట్ చేశారు. ఎవరైనా జాగ్రత్తగా ఎడిట్ చేసిన మీడియాను చూసి పొరపాటు పడి లేదా తొందరపడి విమర్శలు చేయడం సహజం. ఇలాంటి సమయాల్లో వాస్తవాలను తెలుసుకునేందుకు అసలు వీడియోలను వెలుగులోకి తీసుకరావడం ఓ వెబ్‌సైట్ సామాజిక బాధ్యత.
Comments
Please login to add a commentAdd a comment