న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రెండోసారి ఏర్పాటైన ప్రభుత్వం తొలి 50 రోజుల్లో సాధించిన విజయాలు, పనితీరుపై ఓ నివేదికను అధికార బీజేపీ శుక్రవారం విడుదల చేసింది. ఈ 50 రోజుల్లో తమ ప్రభుత్వ పనితీరు ఆదర్శనీయంగా ఉందనీ, సానుకూలా మార్పువైపునకు వెళ్తోందని బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. సమాజంలోని బలహీన వర్గాలు, దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థను బలోపేతంపై తమ ప్రభుత్వం ప్రముఖంగా దృష్టి పెట్టిందని ఆయన వెల్లడించారు. బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక తొలిసారిగా శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
చిన్నారుల రక్షణ, దేశ భద్రత తదితర అంశాలపై తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రశంసించిన నడ్డా, ఇటీవల లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదం పొందిన బిల్లులను కూడా ప్రస్తావించారు. కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, పియూష్ గోయల్‌లు కూడా ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఆర్థికవ్యవస్థ వృద్ధిలో వేగం పెంచడం కోసం 44 కార్మిక చట్టాలను తమ ప్రభుత్వం నాలుగు ప్రధాన చట్టాలుగా మార్చి సంస్కరణలు తీసుకు వచ్చిందని చెప్పారు. మోదీ ప్రభుత్వం తొలి 50 రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు, ఇంతకుముందు 50 ఏళ్లలో మనం చూసినవాటికంటే ఉత్తమమని నడ్డా పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి ఎదిగేందుకు తమ ప్రభుత్వం మౌలిక వసతుల రంగంపై ఖర్చు చేయబోయే కోటి కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఎంతో దోహదపడతాయని నడ్డా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment