సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దిమ్మతిరిగేలా షాక్‌లు మీద షాకులు తగులుతున్నాయి. ఓ వైపు టీడీపీ నేతలు వరుసపెట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే. పార్టీపరంగా ఆ షాక్ నుంచి తేరుకోకముందే మరోవైపు బంధువర్గం నుంచి కూడా చంద్రబాబుకు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఎన్టీ రామారావు పెద్దల్లుడు, చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనయుడు దగ్గుబాటి హితేష్ వైఎస్సార్ సీపీలో చేరారు. (వైఎస్సార్ సీపీలో చేరిన కిల్లి కృపారాణి)
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మామయ్య (లక్ష్మీప్రణతి తండ్రి) నార్నే శ్రీనివాసరావు గురువారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా నార్నే శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘ఏపీలో చంద్రబాబు పాలన సరిగా లేదు. వైఎస్ జగన్‌ను ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలనే పార్టీలో చేరాను. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబంతో నాకు పదేళ్ల నుంచి అనుబంధం ఉంది. నేను వైఎస్సార్ సీపీలో చేరడానికి... జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధం లేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో, లేదో తెలియదు. అయితే పార్టీ గెలుపుకు నా వంతు కృషి చేస్తాను. వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడటమే లక్ష్యమ’ని తెలిపారు.
కాగా చంద్రబాబు నాయుడుకు దగ్గర బంధువు అయిన నార్నే శ్రీనివాసరావు (నార్నే శ్రీనివాసరావు భార్య చంద్రబాబుకు స్వయాన మేనకోడలు) వైఎస్సార్ సీపీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్-లక్ష్మీప్రణతి వివాహానికి చంద్రబాబే పెళ్లిపెద్దగా వ్యవహరించారు కూడా. గత ఎన్నికల్లో టీడీపీ గెలుపు... ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని... మహాకూటమి తరఫున కూకట్‌పల్లి నుంచి పోటీ చేశారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారంటూ టీడీపీ నేతలు ప్రచారం చేసినా... వాళ్లు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇప్పటికే ఈ పరిణామాలను చంద్రబాబు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. మరోవైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయనకు... బంధువర్గం నుంచి గట్టి దెబ్బే తలిగిందని చెప్పుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment