
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని, మంత్రుల రెచ్చగొట్టే ప్రకటనలే ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యకు కారణమని నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆర్టీసీ సంస్థకున్న 50 వేల కోట్ల ఆస్తులపై కేసీఆర్ కన్నేశారని అన్నారు. శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీఆర్‌డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్‌రెడ్డి మృతిచెందడంతో వివిధ రాజకీయ పార్టీల నేతలు అక్కడికి చేరుకున్నారు.
లక్ష్మణ్, రేవంత్, మంద కృష్ణ మాదిగ, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, సీపీఐ నేత నారాయణ, కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు అపోలో ఆస్పత్రికి వచ్చారు. కాగా, ఆర్టీసీ సమ్మెలో భాగంగా నగరంలోని బస్‌భవన్‌తోపాటు ఎంజీబీఎస్, జేబీఎస్ సహా 29 డిపోల వద్ద కార్మికులు పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు నిర్వహించి నిరసన తెలిపారు. ప్రభుత్వ నిరంకుశ విధానాలు, ప్రైవేటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు గోబ్యాక్ అని నినదించారు. శ్రీనివాస్‌రెడ్డి మరణంతో ఆదివారం నిర్వహించ తలపెట్టిన వంటావార్పు కార్యక్రమాన్ని వాయి దా వేశారు. నగరంలో ఆదివారం సుమారు 800 బస్సులను వివిధ రూట్లలో నడిపినట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.
కార్మికుల జీవితంతో చెలగాటం..
సీఎం కేసీఆర్, మంత్రుల రెచ్చగొట్టే వ్యాఖ్యలకు మనస్తాపం చెంది శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివా రం ఆయన మీడియాతో మాట్లాడారు.