సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 21 శాతం పీఆర్సీ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పీఆర్సీతో కూడిన వేతనాలు జూన్ ఒకటో తేదీ నుంచి అమలోకి రానున్నాయి.
కాగా, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బస్ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చూస్తున్నాం. 2017లో ఆనాటి ప్రభుత్వం పీఆర్సీ 16 శాతం ఇచ్చారు. అప్పటి నుంచి మళ్లీ పీఆర్సీ ఇవ్వలేదు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించాం. అందులో భాగంగానే ఉద్యోగులకు 21 శాతం పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించాం.
కొత్త పీఆర్సీ జూన్ ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుంది. 2017 నుంచి 21 శాతం పీఆర్సీతో పే స్కేలు అమలు చేస్తాం. 21 శాతం పీఆర్సీ పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై 418.11 కోట్ల అదనపు భారం పడుతుంది. అలాగే, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేశాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మహాలక్ష్మి స్కీమ్ విజయవంతంగా నడుస్తోంది అని వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment