సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ పాత్ర ఎవరు మర్చిపోరని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఆర్టీసీ కార్మికులు ముందుండి నడిపించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ మార్గ్‌లో 100 కొత్త బస్సులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కలతో కలిసి రేవంత్‌రెడ్డి శనివారం ప్రారంభించారు.
‘కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు కొత్త బస్సులు ప్రారంభించుకుంటున్నాం. రాష్ట్రం ఏర్పడితే సమస్యలు పరిష్కరిస్తారని ఆర్టీసీ కార్మికులు అనుకున్నారు కానీ పరిష్కారం కాలేదు. గత ప్రభుత్వం మిమ్మల్ని విస్మరించింది. ఎంతో మంది ఆర్టీసి కార్మికులు ప్రాణ త్యాగం చేశారు. అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. గత ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి మీ కృషి ఏంతో ఉంది.
మహాలక్ష్మి స్కీమ్‌ను మేనిఫెస్టోలో పెట్టాం. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ పథకం అమలు చేశాం. 15 కోట్ల 27 లక్షల మంది మహిళలు ఆర్టీసి లో ఉచితంగా ప్రయాణం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజమైన అంకెలతో ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టింది. గత ప్రభుత్వాల బడ్జెట్ వాస్తవ రూప దాల్చదు అని అధికారులు అన్నారు’అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment