సాక్షి, అమరావతి : అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డల్లాస్‌లో తెలుగు కమ్యూనిటీ ఆఫ్ నార్త్ అమెరికా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని.. ప్రవాస తెలుగువారిని ఉద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సభలో జ్యోతి ప్రజల్వన చేయడానికి నిరాకరించి.. హిందువులను కించపరిచారంటూ బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ట్విటర్ వేదికగా దుష్ర్పచారానికి ఒడిగట్టారు. ఇటీవలే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఆయన ట్విటర్‌లో చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. జ్యోతి ప్రజ్వలన విషయమై ప్రజలను తప్పుదోవ పట్టించేవిధంగా సీఎం రమేశ్, బీజేపీ శ్రేణులు చేసిన ట్వీట్లపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.
సీఎం రమేశ్ అజ్ఞానంతో, హిందువులను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే దురుద్దేశంతో ఈ ఆరోపణలు చేశారని నెటిజన్లు అంటున్నారు. నిజానికి అమెరికాలోని స్టేడియంలలో జ్యోతి ప్రజ్వలన లాంటిది చేయనివ్వరని, అగ్నిప్రమాదాలు జరిగే అవకాశముండటంతో స్డేడియం లోపల లైటర్ కానీ, అగ్గిపెట్టెను కానీ వాడటానికి సెక్యూరిటీ సిబ్బంది అనుమతించబోరని, అయినా, మైదానంలోకి ప్రవేశించే ముందే సీఎం వైఎస్ జగన్‌కు వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారని, వారి నుంచి హారతి తీసుకొని, బొట్టు పెట్టుకొని ఆయన స్టేడియంలోకి ప్రవేశించారని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. గతంలోనూ పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ జ్యోతి ప్రజ్వలన చేసిన ఫొటోలు, వీడియోలు పోస్టు చేసి.. సీఎం రమేశ్ దుష్ప్రచారాన్ని బట్టబయలు చేస్తున్నారు.
సీఎం రమేశ్‌కు కౌంటర్
సీఎం రమేశ్ ఆరోపణలపై వైఎస్సార్‌సీపీ ఎన్నారై వింగ్ అధ్యక్షుడు కడప రత్నాకర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అమెరికాలోని స్టేడియంల లోపల జ్యోతి వెలిగించడానికి అక్కడి భద్రతా సిబ్బంది అనుమతివ్వలేదని, స్టేడియం లోపల ఎలాంటి నిప్పు వెలిగించరాదని కఠిన నిబంధనలు ఉన్నాయని ఆయన తెలిపారు. అందుకే స్డేడియంలో వేదిక మీద ఉన్న ఎలక్ట్రికల్ క్యాండిల్స్ వెలిగిస్తున్నట్లు చంద్రబాబులా వైఎస్ జగన్ యాక్టింగ్ చేయలేదని వివరించారు. అందుకే స్టేడియం లోపలికి వెళ్లేముందే సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు చేసి లోపలికి వచ్చారని తెలిపారు. కానీ కావాలని బీజేపీ, టీడీపీ నేతలు ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భక్తి, మతం ముసుగులో రాజకీయాల కోసం మాఫియా ముఠాలు చెలరేగుతున్నాయని, వీరిని అరికట్టకపోతే మతాన్ని భ్రష్టుపట్టిస్తారని ఆయన మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment