సాక్షి, అమరావతి: అమెరికాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా పండుగాయల రత్నాకర్‌కు మూడో సారి పదవీ కాలాన్ని పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. మూడో సారి ఈ బాధ్యతలను తనకు అప్పగించడం పట్ల, తన పట్ల నమ్మకం ఉంచినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి పండుగాయల రత్నాకర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని నూటికి నూరు శాతం నిలబెట్టుకుంటానని, సీఎం జగన్‌తో కలిసి పని చేయడం తన అదృష్టమని రత్నాకర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరును, అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసేలా చేపడుతున్న వివిధ పనులను అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉంటోన్న ప్రవాసాంధ్రులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని రత్నాకర్ తెలిపారు.
ఎన్నారైల సభలు, సమావేశాలతో పాటు వివిధ వేదికల ద్వారా ఏపీ ప్రభుత్వ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రవాసాంధ్రులకు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. దీని వల్ల ఏపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఎన్నారైల భాగస్వామ్యం పెంచామని రత్నాకర్ అన్నారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా వేర్వేరు పాఠశాలల్లో ఎంతో మంది ప్రవాసాంధ్రులు తమ వంతుగా విరాళాలందించే దిశగా కృషి చేస్తున్నామని, అలాగే ఆస్పత్రుల అభివృద్ధి కోసం నిధులిచ్చేలా ప్రోత్సహించామని తెలిపారు. కరోనా విపత్కాలంలో వెంటిలేటర్లతో పాటు బెడ్స్‌ను ఏర్పాటు చేయడంలో ప్రవాసాంధ్రులను భాగస్వామ్యం చేశామన్నారు. దీంతో పాటు పుట్టిన నేల రుణం తీర్చుకునేలా ఎన్నారైలను వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
‘‘విద్యా మూలం ఇదం జగత్" అన్న నానుడిని మనసావాచ నమ్ముతున్న ముఖ్యమంత్రి.. విద్యయే ప్రభుత్వానికి ప్రధాన అంశంగా భావిస్తూ అడుగులు వేస్తున్నారని రత్నాకర్ తెలిపారు. భారత దేశ చరిత్రలోనే విద్యా వ్యవస్థ పై ఇంతలా దృష్టి సారించిన నాయకుడు మరెవ్వరూ లేరని, ఏ రాష్ట్రంలోనూ విద్య కోసం ఇన్ని పథకాలు, ఇంత ఖర్చు చేసిన దాఖలాలు లేవన్నారు. అన్ని సమస్యలకు చదువే సమాధానం అని సీఎం నమ్మడం ఆయనలోని ఓ కొత్తతరం నాయకత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
విద్యావ్యవస్థ బాగుచేయడంతో పాటుగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పారిశ్రామిక అభివృద్ధికి సీఎం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు రత్నాకర్. పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు, 3 పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు, 8 మేజర్ పోర్టుల నిర్మాణం, వ్యవసాయ-ఆక్వా ఉత్పత్తుల మార్కెటింగ్, తదితర ప్రత్యేక కార్యక్రమాలతో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం వచ్చే రెండేళ్లలో గొప్పగా అభివృద్ధి చెందబోతోందని, ఇప్పటికే అనేక మల్టీ నేషనల్ కంపెనీలు రాష్ట్రాల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment