సోమిరెడ్డికి కమీషన్ల మీదే ధ్యాస | Kakani Govardan Reddy Slams Somireddy Chandramohan Reddy | Sakshi
Sakshi News home page

సోమిరెడ్డికి కమీషన్ల మీదే ధ్యాస

Published Sat, Feb 2 2019 1:00 PM | Last Updated on Sat, Feb 2 2019 1:00 PM

Kakani Govardan Reddy Slams Somireddy Chandramohan Reddy - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు , మనుబోలు: డేగపూడి–బండేపల్లి లింక్‌ కెనాల్‌ విషయంలో మంత్రి సోమిరెడ్డికి రైతుల శ్రేయస్సు కన్నా కమిషన్ల మీద ధ్యాస ఎక్కువగా కనిపిస్తుందని సర్వేపల్లి ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బ్రాంచ్‌ కెనాల్‌ కింద 12,500 ఎకరాలు సాగవుతుందని, అది ఎండిపోయే పరిస్థితిలో ఉండడంతో వెంటనే నీళ్లందించి కాపాడాలంటే రూ.30 కోట్ల కాంట్రాక్టును నామినేషన్‌ పద్ధతిలో మెగా కంపెనీకి ఇస్తే వారు వెంటనే పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తారని చీఫ్‌ ఇంజినీర్‌ చేత ప్రభుత్వానికి ఉత్తరం రాయించారని తెలిపారు.

వాస్తవానికి ప్రస్తుతం బండేపల్లి బ్రాంచ్‌ కెనాల్‌ పరిధిలో సెంటు భూమిలో కూడా పంటలు సాగు చేయడం లేదని పేర్కొన్నారు. నామినేషన్‌పై పని ఇచ్చేందుకు ఒప్పుకోకుండా ప్రభుత్వం తిప్పి పంపిందన్నారు. అనుకూలమైన కాంట్రాక్టర్‌కు ఇచ్చేందుకు ఆన్‌లైన్‌లో బ్యాంక్‌ గ్యారెంటీ తీసుకోకుండా ఆ ఆప్షన్‌ను ఎత్తేశారని తెలిపారు. మొదట 28 తేదీకి టెండర్‌ పిలిస్తే అనుకూలమైన కాంట్రాక్టర్‌ దొరకకపోవడంతో దాన్ని రద్దు చేయించి రెండో తేదీకి మార్పించారని తెలిపారు. ఓ వైపు ఆలస్యమయిపోతుందంటూనే 28వ తేదీ నుంచి రెండో తేదీకి ఎందుకు మార్పించారని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లు పూర్తయ్యాక ప్రారంభోత్సవం చేయాల్సిన సమయంలో శిలాఫలకాలు వేయడానికి సిగ్గుండాలన్నారు. రెండో తేదీ ఇరిగేషన్‌ ఎస్సీని కలిసి లింక్‌ కాలువ పనులు వెంటనే ప్రాంభించకుంటే దాని పర్యవసనాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతామన్నారు. మళ్లీ పనులు వాయిదా వేస్తే ఎస్సీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగుతామన్నారు. ఇప్పుడు చేయకపోతే తాము అధికారంలోకి వచ్చిన ఏడాది లోపు కాలువ పూర్తి చేసి సాగునీరు అందిస్తామని మరోమారు స్పష్టం చేశారు. ఆయన వెంట మండల ఉపాద్యక్షుడు తురిమెర్ల రఘురాంరెడ్డి, వైఎస్సార్‌ సీపీ నాయకులు బొమ్మిరెడ్డి హరగోపాల్‌రెడ్డి, చిట్టమూరు అజయ్‌రెడ్డి, మన్నెమాల సాయిమోహన్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, చేరెడ్డి రామిరెడ్డి, దాసరి భాస్కరగౌడ్, నారపరెడ్డి కిరణ్‌రెడ్డి, జట్టి సురేందర్‌రెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement