భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండన్‌తో శుక్రవారం సమావేశమై అసెంబ్లీ వేదికగా జరిగే బలపరీక్షపై చర్చించారు. జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన క్రమంలో కమల్‌నాథ్ సర్కార్ సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడనుంది. మరోవైపు స్పీకర్ నర్మదా ప్రసాద్ ప్రజాపతి ఎదుట హాజరై రాజీనామాలు సమర్పించేందుకు రెబెల్ ఎమ్మెల్యేలకు ఇచ్చిన డెడ్‌లైన్ దగ్గరపడటంతో హోలీ విరామం అనంతరం గవర్నర్ లాల్జీ టాండన్ భోపాల్‌కు చేరుకోవడంతో రాజకీయ పరిణామాలు జోరందుకున్నాయి.
ఇక బీజేపీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ బేరసారాలకు పాల్పడుతోందని గవర్నర్‌కు రాసిన లేఖలో సీఎం కమల్‌నాథ్ ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ అనైతిక, చట్టవిరుద్ధంగా బేరసారాలకు దిగుతోందని లేఖలో దుయ్యబట్టారు. స్పీకర్ నిర్ణయం ప్రకారం ఈ నెల 16న అసెంబ్లీలో జరగనున్న బలపరీక్షకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నానని ఈ లేఖలో సీఎం పేర్కొన్నారు. ప్రజాస్వామ్య, శాసన వ్యవస్థలను పరిరక్షిస్తూ రాజ్యాంగ విలువలను కాపాడటంలో ఏ ఒక్క అవకాశాన్నీ జారవిడువబోమని తాను మధ్యప్రదేశ్ ప్రజలకు హామీ ఇస్తున్నానని అన్నారు. కాగా రాజీనామా చేసిన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఆరుగురు మంత్రులు సహా 13 మందికి శుక్ర, శనివారాల్లో తన ఎదుట హాజరు కావాలని మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ప్రజాపతి నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా తనను కలిసి రాజీనామాలు సమర్పించాలని ఆయన చెబుతున్నారు.నిబంధనలు, ఆధారాలను పరిశీలించిన మీదట వారి రాజీనామాలపై ఓ నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment