
సాక్షి, విజయవాడ: టీడీపీ హయాంలో చెప్పుకోదగ్గ కనీసం 15 అభివృద్ది పథకాలన్నా ఉన్నాయా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ఎప్పుడూ కాకిలాగా బతుకుతాడే తప్పా హంసలా బతకడం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు చేతకాదని ఆయన ఎద్దేవ చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరికి ఇష్టమొచ్చిన ఫ్రంట్‌లోకి వాళ్లు వెళ్లొచ్చని.. అందరూ చంద్రబాబు చెప్పిన ఫ్రంట్‌లోకి వెళ్లాలా అంటూ ధ్వజమెత్తారు. బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన టీడీపీ పాలనపై నిప్పులు చెరిగారు. అమిత్ షాను అడ్డుకుంటామనడం టీడీపీ సంస్కృతని ఆరోపించారు. ప్రతిదానికి చంద్రబాబు సైన్దవుడిలా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.
ఒంటరిగానే ఎన్నికలకు
స్టీల్ ఫ్లాంట్ వస్తుందని తెలిసి టీడీపీ నాయకులు నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు రాయలసీమపై చిత్తశుద్ధి ఉంటే హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేసేవారని అన్నారు. చార్మినార్ కట్టించిన వ్యక్తి రేపు విశాఖ రైల్వే జోన్‌కు కూడా శంకుస్థాపన చేస్తాడని ఎద్దేవ చేశారు. అమిత్ షాను ఎందుకు అడ్డుకుంటారో టీడీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఒంటరిగానే ఎన్నికలకు వెళుతుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment