అమిత్ షా, నడ్డాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ
తామడిగిన సీట్లు ఇవ్వాల్సిందేనన్న బీజేపీ అగ్రనేతలు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో ప్రతిపక్ష పార్టీల పొత్తుల వ్యవహారంలో శుక్రవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. న్యూఢిల్లీలో గురువారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో అమిత్ షా నివాసంలో టీడీపీ, జనసేన అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై వీరు చర్చించినట్లు సమాచారం. తమకు 8–10 లోక్‌సభ స్థానాలు, 15–20 అసెంబ్లీ స్థానాలు ఇస్తేనే పొత్తుకు ఓకే చెబుతామని బీజేపీ పెద్దలు కరాఖండిగా చెప్పారని తెలిసింది. ఈ సమావేశంంలో తీసుకున్న నిర్ణయాలపై శుక్రవారం ఒక స్పష్టత రానుండగా.. సీట్ల సర్దుబాటు విషయంలో బీజేపీ పెద్దలతో జరిగిన భేటీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
గతంలో రెండుసార్లు పొత్తుల విషయంలో బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిగినా ఏమాత్రం లాభం లేకపోవడంతో.. వారు విధించే ఏషరతులైనా అంగీకరించి పొత్తు ఖరారు చేసుకోవాలని టీడీపీ, జనసేన విశ్వప్రయత్నం చేశాయి. ఆ రెండు పార్టీల అధ్యక్షులు తమతో పొత్తు విషయంలో ఏ విధంగా అర్రులు చాస్తున్నారు అనే విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు బుధవారం జేపీ నడ్డా, అమిత్ షా, బీఎల్ సంతోష్‌ల దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో చంద్రబాబు, పవన్‌లకు ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. దీంతో చంద్రబాబు, పవన్ గురువారం ఢిల్లీ వచ్చారు.
రాత్రి 10:20 గంటలకు చంద్రబాబు, 10:35 గంటలకు పవన్ కళ్యాణ్‌లు అమిత్ షా నివాసానికి చేరారు. సుమారు గంట సేపు సమావేశం అయ్యారు. సమావేశం తర్వాత విలేకరులతో మాట్లాడకుండా చంద్రబాబు ముఖం చాటేశారు. చర్చలు ఆశాజనకంగా జరగలేదనే విషయం ఆయన ముఖ కవళికలను బట్టి తెలుస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. గతంలో ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చంద్రబాబును అమిత్ షా డిమాండ్ చేసినట్లు తెలిసింది.
ఇక 2018లో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి వెళ్లిపోయిన తర్వాత విశాఖ, రాజంపేట. రాజమండ్రి, హిందూపురం, తిరుపతి, అరకు, విజయవాడ వంటి లోక్‌సభ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై తాము ఏ విధంగా ప్రత్యేక దృష్టి సారించామన్న అంశాన్ని బీజేపీ పెద్దలు చర్చల సందర్భంగా చెప్పారు. అందువల్ల తామడిగిన లోక్‌సభ స్థానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కేటాయించాలని బీజేపీ అగ్రనేతలు చంద్రబాబు, పవన్‌లకు స్పష్టం చేశారని తెలిసింది. మరోవైపు ఒకటి రెండు రోజుల్లో జరగనున్న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి బరిలో నిలిచే బీజేపీ అ«భ్యర్థుల జాబితాపై ఆమోదముద్ర పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment