ఎట్టకేలకు బీజేపీతో కుదిరిన చంద్రబాబు పొత్తు
అన్ని విధాలా సహకరిస్తామని అమిత్‌షాకు బాబు వేడుకోలు
రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని పైకి మాత్రం కవరింగ్
లోపల మాత్రం కేసుల నుంచి బయట పడాలనే వ్యూహం
మరోమారు అమిత్ షా, నడ్డాలతో బాబు ద్వయం భేటీ
బీజేపీ, జనసేనకు కలిపి 8 లోక్‌సభ, 30 అసెంబ్లీ స్థానాల ప్రతిపాదన
సంయుక్త ప్రకటన విడుదల చేసిన బీజేపీ, జనసేన, టీడీపీ.. ఒకటి, రెండు రోజుల్లో సీట్ల పంపకాలపై చర్చ
టీడీపీ, జనసేన ఎన్డీఏలో చేరాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న జేపీ నడ్డా
సీట్ల సర్దుబాటుపై మాత్రం నోరు మెదపని ఆ పార్టీ అగ్ర నేతలు
6 ఎంపీ, 6 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినట్లు ఎల్లో మీడియాకు బాబు లీకులు
అధికారికంగా బీజేపీ, జనసేనతో పొత్తు.. తెరవెనుక కాంగ్రెస్‌తో లాలూచీ
జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోలేకే అపవిత్ర బంధాలు.. తన స్వార్థం కోసం ఎంతకైనా దిగజారతారని మళ్లీ నిరూపణ
బీజేపీ రాష్ట్రానికి ద్రోహం చేసిందంటూ 2019లో అడ్డగోలుగా విమర్శలు
మోదీ, అమిత్‌షాను ఇష్టానుసారం తిట్టిపోసి ఎన్‌డీఏ నుంచి నిష్క్రమణ
తిరుపతికి వచ్చిన అమిత్‌షాపై రాళ్లు వేయించిన చరిత్ర.. ఎన్‌డీఏ ప్రభుత్వంపై ఏకంగా అవిశ్వాస తీర్మానం
ఎన్నికల్లో ఓడిపోగానే మళ్లీ వెంటనే బీజేపీ ప్రాపకం కోసం పాట్లు
గతం మరచి నిస్సిగ్గుగా మళ్లీ బీజేపీ చెంతకు చేరిన వైనం
చంద్రబాబు తీరుతో నివ్వెరపోతున్న రాష్ట్ర ప్రజలు
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మూడు రోజుల పాటు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంటి ముందు పడిగాపులు పడిన అనంతరం ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో టీడీపీ – జనసేన పొత్తు కుదిరింది. ఈ మేరకు శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంపూర్ణ మద్దతు తమకు ఉంటుందని ఆశిస్తున్నట్లు వారు ఆకాంక్షించారు.
పొత్తుల వ్యవహారంలో బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు మూడు రోజుల పాటు హస్తినలో మకాం వేసిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు శనివారం మరోసారి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పొత్తుల అంశంపై అసంపూర్తిగా ఆగిపోయిన అంశాలపై, బీజేపీ డిమాండ్లపై చర్చించారు.
రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీ, జనసేన పార్టీలకు కలిపి 8 స్థానాలను, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 30 అసెంబ్లీ సీట్లను కేటాయించేందుకు ముగ్గురి మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని టీడీపీ వర్గాల సమాచారం. కాగా, లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల కేటాయింపునకు సంబంధించిన విధివిధానాలపై చర్చించేందుకు ఒకటి రెండు రోజుల్లో మరోసారి మూడు పార్టీల నాయకులు భేటీ అవుతారని ఆయా పార్టీలు ప్రకటించాయి. కాగా, ఎన్డీఏలో చేరాలన్న టీడీపీ, జనసేనల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు జేపీ నడ్డా తెలిపారు.
చకోర పక్షుల్లా ఎదురు చూపు
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లకు బీజేపీతో పొత్తు విషయంలో ఎదురుచూపులు తప్పలేదు. వైఎస్సార్‌సీపీని ఒంటరిగా ఎదుర్కొనేందుకు ధైర్యం లేని టీడీపీ.. జనసేనతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయినా వైఎస్ జగన్‌పై పోటీకి బలం సరిపోదని కొద్ది రోజులుగా బీజేపీ సాయం కోరుతూ వస్తోంది. ఇందులో భాగంగా మూడు రోజుల క్రితం బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకోవాలని ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు గురువారం మొదటి దఫా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో ఆయనతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు.
అయితే బీజేపీ, జనసేనలకు కలిపి కేటాయించే సీట్ల విషయంలో జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. తమ డిమాండ్లకు తగ్గట్లుగా 8 నుంచి 10 లోక్‌సభ స్థానాలను కేటాయించాలని బీజేపీ డిమాండ్ చేసింది. అంతేగాక పార్టీలో అంతర్గతంగా తాము చర్చించుకున్న తర్వాత మరోసారి కలుద్దామని బాబు ద్వయానికి స్పష్టం చేసింది. శుక్రవారం మొత్తం బీజేపీ పెద్దల నుంచి కబురు వస్తుందని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు చకోర పక్షుల్లా ఎదురు చూశారు.
అయితే శనివారం ఉదయం పొత్తుల వ్యవహారంపై చర్చించేందుకు అమిత్ షా, నడ్డాలను కలవాలని అమిత్ షా కార్యాలయం నుంచి పిలుపు రాగానే ఉదయం 11:10 గంటలకు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు షా నివాసానికి చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు జరిగిన చర్చల అనంతరం బాబు ద్వయం అక్కడి నుంచి వెనుదిరిగారు. అనంతరం కలిసి పోటీ చేసే విషయంపై మూడు పార్టీల మధ్య అవగాహన కుదరిందని సంయుక్త ప్రకటనలో వెల్లడించారు.
నీతిలేని బాబు.. అనైతిక పొత్తు
రాష్ట్ర ప్రయోజనాల పేరు చెప్పి సొంత వ్యవహారాలను చక్కదిద్దుకోవడంలో నేర్పరి అయిన చంద్రబాబు మరోసారి అదే బాట ఎంచుకుని బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. తద్వారా తాను నీతి లేని రాజకీయ నాయకుడినని, తనకు రాజకీయ అవసరాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలతో పని ఉండదని నిరూపించారు. పైకి రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు అని బిల్డప్ ఇచ్చుకుంటున్నా, అవినీతి కేసుల నుంచి తనను రక్షించుకోవడమే లక్ష్యంగా ఆయన బీజేపీ పెద్దల ఎదుట సాగిలపడినట్లు స్పష్టమవుతోంది.
మూడు రోజులపాటు ఢిల్లీలోనే తన పార్ట్‌నర్ పవన్ కళ్యాణ్‌తో కలిసి మకాం వేసి.. అమిత్ షా కరుణ కోసం పాకులాడటం స్పష్టంగా కనిపించింది. తనను కేసుల నుంచి బయట పడేయాలని, అందుకోసం తాను దేనికైనా సిద్ధమని కాళ్లావేళ్లాపడి పొత్తుకు ఒప్పించారని తెలుస్తోంది. దీంతో టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేయనున్నట్లు బీజేపీ కేంద్ర కార్యాలయం శనివారం సాయంత్రం అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది.
సీట్ల సర్దుబాటు మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. త్వరలో ఏ సీట్లలో ఎవరు పోటీ చేస్తారో తేలుతుందని బీజేపీ ప్రకటించినా, చంద్రబాబు మాత్రం బీజేపీకి 6 ఎంపీ, 6 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినట్లు ఎల్లో మీడియాకు లీకులిచ్చారు. జనసేన, బీజేపీకి కలిపి 30 ఎమ్మెల్యే, 8 ఎంపీ స్థానాలు కేటాయించినట్లు ఎల్లో మీడియాలో అదేపనిగా ప్రచారం చేయిస్తుండడం గమనార్హం.
మోడీని తిట్టి.. ఎన్డీఏపై అవిశ్వాసం పెట్టి..
ఇదే చంద్రబాబు 2018లో ఏన్డీఏ నుంచి నిష్క్రమించాక బీజేపీ పెద్దలను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. 2014లో తన ప్రయోజనం కోసం ఎన్డీఏతో కలిసి పోటీ చేశారు. గెలిచాక కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీతో అధికారాన్ని పంచుకున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి రాష్ట్రాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టారు. దానిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం, వైఎస్ జగన్ ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరాటం చేయడంతో భయపడి 2018లో యూటర్న్ తీసుకుని ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌తో కలిశారు.
ఆ తర్వాత చంద్రబాబు ఎన్డీఏను టార్గెట్ చేసుకుని చేసిన విమర్శలు, ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఎన్టీఏ ప్రభుత్వం రాష్ట్రానికి నమ్మకద్రోహం చేసిందని, హోదా ఇవ్వకుండా మోసం చేసిందని, ప్రధాని మోడీది విఫల ప్రభుత్వమని, ఆయన దేశాన్ని ముంచేశాడని, దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని రకరకాల ఆరోపణలు గుప్పించారు. ప్రధాని మోడీ తనకంటే జూనియర్ అని, అదృష్టం బాగుండి ప్రధాని అయ్యారని, ఆయన వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారంటూ లెక్కలేనన్ని విమర్శలు చేశారు. చివరికి ప్రధానిని ఉగ్రవాది అని కూడా దూషించారు.
ఆయన తల్లిని, భార్య పేర్లను ప్రస్తావించి మరీ దిగజారుడు ఆరోపణలకు దిగారు. ప్రధాని రాష్ట్ర పర్యటనకు వస్తే నల్ల చొక్కాలు, నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసనలు తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తిరుపతి పర్యటనకు వస్తే టీడీపీ నేతలతో రాళ్ల దాడి చేయించారు. అంతటితో ఆగకుండా లోక్‌సభలో ఏన్డీఏకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మోడీని అధికారం నుంచి దించేయాలనేంత వరకూ వెళ్లారు. ధర్మపోరాట దీక్షల పేరుతో నానా హడావుడి చేశారు. కానీ ఆయన వ్యూహాలు, రాజకీయాలు తల్లకిందులై ప్రజలు చంద్రబాబును వదిలించుకున్నారు. చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఇవ్వనంత ఘోర వైఫల్యాన్ని కట్టబెట్టారు.
పైకి బీజేపీ, జనసేన.. లోపల కాంగ్రెస్‌తో..
గతంలో నోటికొచ్చినట్లు తిట్టిపోసి, విడిపోయిన ఎన్డీఏతో మళ్లీ కలిసి ప్రయాణించేందుకు చంద్రబాబు సిగ్గు విడిచి చేతులు కలపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోడీని వ్యక్తిగతంగా దూషించి, ఎన్డీఏ ప్రభుత్వాన్ని అనరాని మాటలు అని.. ఇప్పుడు ఆ విషయాన్నే మరచిపోయినట్లు నటిస్తూ రాజకీయ లబ్ధే పరమావధిగా ఇప్పుడు మళ్లీ పొత్తు కుదుర్చుకున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఒకవైపు అధికారికంగా బీజేపీ, జనసేనతో పొత్తు కుదుర్చుకుని.. తెరవెనుక లోపాయికారిగా కాంగ్రెస్‌తోనూ అవగాహనతో ఉన్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల.. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడుతుండడం, ఆమెకు బాబు మద్దతుగా నిలిచి మాట్లాడుతుండడం తెలిసిందే. ఇలా అపవిత్ర పొత్తులు, అవగాహనల ద్వారా తనకంటూ ఒక విధానం, ఒక పద్ధతి లేదనే విషయాన్ని చంద్రబాబు నిస్సిగ్గుగా చాటి చెబుతున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
వైఎస్ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోలేకే..
సీఎం వైఎస్ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోలేక చంద్రబాబు ఇప్పటికే జనసేనతో బంధాన్ని కొనసాగిస్తున్నారు. జగన్‌కు పోటీ ఇవ్వడానికి అది సరిపోదనే భావనతో కేంద్రంలో బీజేపీ మద్దతు కోసం చాలా కాలంగా ప్రాధేయ పడుతున్నారు. సరికొత్త గిమ్మిక్కులతో ఎట్టకేలకు ఆ కూటమితో జట్టుకట్టారు. మూడు రోజులు అమిత్‌షా ఇంటి వద్దే పడిగాపులు పడి, చివరికి బీజేపీ ఏం చెప్పినా చేసేందుకు సిద్ధపడి ఎన్డీఏలో చేరుతున్నారు.
బీజేపీ, జనసేనతో కలిసి నడిస్తేనే ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి కనీస పోటీ అయినా ఇవ్వగలనని మొదటి నుంచి చంద్రబాబు భావిస్తున్నారు. టీడీపీని బతికించుకోవడంతోపాటు తన కొడుకు రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే బీజేపీతో సయోధ్య తప్పదనే ఆలోచనతోనే సిగ్గు విడిచి ఆ పార్టీతో జట్టు కట్టారని స్పష్టమైంది.
మళ్లీ ఎన్డీఏలో చేరాం
బీజేపీతో పొత్తు కుదిరిందని, రాష్ట్ర ప్రయోజనాల కోసం మళ్లీ ఎన్డీఏలో చేరుతున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. శనివారం ఢిల్లీ నుంచి ఆయన టీడీపీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. బీజేపీతో పొత్తు ఖరారైన నేపథ్యంలో కొన్ని సీట్లను వదులుకోక తప్పదన్నారు. పరిస్థితులను అర్థం చేసుకోవాలని నేతలకు సూచించారు. సీట్ల పంపకం చివరి దశకు చేరుకుందని, మరో సమావేశం తర్వాత పూర్తి స్పష్టత వస్తుందని తెలిపారు.
పొత్తులో భాగంగా ప్రస్తుతానికి 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలను బీజేపీ, జనసేనలకు ఇస్తున్నట్లు నేతలకు తెలిపారు. టీడీపీ–బీజేపీ–జనసేన మధ్య పొత్తుపై ఎలాంటి గందరగోళం లేదని తెలిపారు. టీడీపీకి కేంద్రం సహకారం చాలా అవసరమని, పొత్తుకు ఇదే కారణమని చెప్పారు. ఈ నెల 17న టీడీపీ–జనసేన నిర్వహించే ఉమ్మడి భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించామని తెలిపారు. మూడు పార్టీలు కలిసి ఉమ్మడి సభ నిర్వహిస్తామని చెప్పారు.
మోడీ పాల్గొనే అవకాశం ఉందని, ఇందుకు అనువైన ప్రదేశం ఎంపిక చేయాలని నేతలకు సూచించారు. ఈ నెల 17 లేదా 18 తేదీల్లో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఇదిలా ఉండగా ‘తిరిగి ఎన్‌డీఏలో చేరినందుకు సంతోషిస్తున్నా. పవన్ కళ్యాణ్‌తో కలిసి, ఏపీలో ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, అభివృద్ధిలో కొత్త శకానికి నాంది పలికేందుకు, మోడీతో కలిసి పని చేయడం కోసం ఎదురుచూస్తున్నా’ అని ఎక్స్‌లో చంద్రబాబు పోస్ట్ చేశారు. ఇది మూడు పార్టీల మధ్య పొత్తు మాత్రమే కాదని, దేశానికి సేవ చేయడానికి కట్టుబడి ఉన్న ముగ్గురి భాగస్వామ్యమని పేర్కొన్నారు.
కాగా, రాష్ట్ర విభజన కారణంగా రాష్ట్ర సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లో పదేళ్లగా కొనసాగుతున్న గందరగోళంతో పాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వ కారణంగా ఐదేళ్లుగా తలెత్తిన సమస్యలు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కలయిక ద్వారా తీరబోతున్నాయని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ తెలిపారు. ఎన్డీయేలో భాగస్వామిని చేసినందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలుపుతూ శనివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మూడు పార్టీల మధ్య సీట్ల కేటాయింపు ఒకటి రెండు రోజుల్లో వెల్లడిస్తామని జనసేన పార్టీ శనివారం రాత్రి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది.
కోవర్టుల సాయంతో బీజేపీ చెంతకు
2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయాక కాంగ్రెస్‌ను వదిలేసిన చంద్రబాబు.. వెంటనే నిస్సిగ్గుగా బీజేపీని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఓడిపోయిన మరుసటి రోజు నుంచే బీజేపీ ప్రాపకం కోసం పరితపిస్తూనే ఉన్నారు. కానీ చంద్రబాబు గుంట నక్క రాజకీయాలు గ్రహించిన ప్రధాని మోడీ ఆయన్ను ఇన్నాళ్లూ దరి చేరనీయలేదు. అయినా చంద్రబాబు పట్టు విడవకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ఇందుకోసం తన బినామీలైన సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారిని అధికారం పోగానే బీజేపీలోకి పంపారు. వారు బీజేపీలో ఉంటూనే చంద్రబాబు కోవర్టులుగా పనిచేస్తూ ప్రస్తుతం పొత్తు కుదర్చడంలో కీలక భూమిక పోషించారు. రాష్ట్ర బీజేపీలోని ముఖ్య నాయకులను తన గుప్పిట్లో పెట్టుకుని వారి ద్వారా బీజేపీతో కలిసేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేశారు. మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీతో పొత్తు కలిపేలా చేసి ఆయన్ను కూడా తన కోసం పని చేయించుకున్నారు.
జనసేన బీజేపీతో పొత్తులో ఉండగానే, తాను జనసేనతో పొత్తు పెట్టుకుని మూడు పార్టీలు కలిసి పని చేయాలనే దిక్కుమాలిన వ్యూహాన్ని అమలు చేశారు. అందులో భాగంగా టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ పెద్దల కాళ్లావేళ్లా పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే ఇటీవల స్వయంగా బయటపెట్టారు. పొత్తు కుదిర్చే క్రమంలో బీజేపీ పెద్దలతో తాను ఛీవాట్లు తిన్నట్లు కూడా చెప్పారు.
దీన్నిబట్టి చంద్రబాబు బీజేపీతో కలిసేందుకు తెర వెనుక ఎందరిని ప్రయోగించారో, ఎన్ని కుయుక్తులు పన్నారో అర్థమవుతోంది. మొత్తంగా చంద్రబాబు కాళ్ల బేరానికి రావడంతో బీజేపీ పెద్దలు పొత్తుకు అంగీకరించినట్లు స్పష్టమవుతోంది. రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు రెండవసారి బీజేపీతో కలవడంపై రాష్ట్ర ప్రజలు నివ్వెరపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment