బాబు పర్యటనపై టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ
భయంతోనే ఢిల్లీలో కాళ్లబేరం.. పిలుపు రాకపోయినా వెళ్లి పడిగాపులు!
ఒకవేళ పొత్తు ఖరారైతే మరిన్ని సీట్లు కోల్పోతామని కేడర్‌లో భయం
బాబు మాటలను మోదీ, అమిత్ షా మరచిపోలేదు
అందుకే పొత్తు పేరుతో ముప్పు తిప్పలు పెడుతున్నారు
ఎటూపాలుపోక బాబు తిప్పలు
సాక్షి, అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్నా చంద్రబాబు టికెట్లు ఖరారు చేయకుండా ఢిల్లీ చుట్టూ చక్కెర్లు కొట్టడం టీడీపీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. ఒక పక్క సీనియర్ నేతలకు టికెట్లు కేటాయించకపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ బీజేపీతో పొత్తు కుదిరితే తమ సీట్లకు ఎక్కడ ఎసరు వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకూ నియోజకవర్గంలో అన్నీ తామై చక్రం తిప్పిన తాము ఇప్పుడు టికెట్‌ను బీజేపీకి కేటాయిస్తే తమ గతేమి కానని భయంతో ఉన్నారు. సీట్ల పంపకంలో గందరగోళం జరుగుతున్నా చంద్రబాబుకు మాత్రం ధ్యాసంతా బీజేపీపైనే ఉంది.
ప్రధాని మోడీ, అమిత్ షాను ప్రసన్నం చేసుకుని పొత్తు ఖరారు చేయాలని చూస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం చంద్రబాబుతో ఆడుకుంటోందని, అందువల్లే పొత్తు వ్యవహారం కొలిక్కి రావడం లేదని సమాచారం. రోజురోజుకీ టీడీపీ పరిస్థితి దిగజారిపోతున్న తరుణంలో బీజేపీ కాళ్లా వేళ్లా పడి ఏదోలా పొత్తు కుదుర్చుకోవాలని బాబు వెంపర్లాడుతున్నారు. ఇంతకూ ఢిల్లీ నుంచి పిలుపు వస్తేనే వెళ్లారా.. లేక ఆయనే అక్కడికి వెళ్లి పడిగాపులు పడుతున్నారా? అనే చర్చ పార్టీ నేతల మధ్య సాగుతోంది.
చంద్రబాబుపై నమ్మకం కోల్పోయిన బీజేపీ
చంద్రబాబును కేంద్ర బీజేపీ పెద్దలు నమ్మే పరిస్థితిలో లేరు. ఒక్కో ఎన్నికలకు ఒక్కో పార్టీతో పొత్తు పెట్టుకునే చంద్రబాబుతో కలసి స్నేహం చేయడానికి బీజేపీ ససేమిరా అంటోంది. 2019 ఎన్నికల్లో ప్రధాని మోడీతోపాటు అమిత్‌షాలపై వ్యక్తిగత విమర్శలకు దిగిన చంద్రబాబు మాటలు వారు ఇప్పటికీ మరచిపోలేదు. ఇప్పుడు మళ్లీ తమతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారంటే ఆ పార్టీ పరిస్థితి అంతంతగానే ఉన్నట్లు అంచనాకొచ్చారు. టీడీపీ గెలిచే అవకాశం లేదని సర్వేలు కూడా చెబుతుండటంతో చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి వారు ఆసక్తి చూపించడం లేదు.
గెలిచే అవకాశం లేకే చంద్రబాబు పొత్తు కోసం చుట్టూ తిరుగుతున్నారని బీజేపీ ఆలోచిస్తోంది. అందువల్లే చంద్రబాబుతో మోదీ భేటీ అయ్యేందుకు ఆసక్తి కనపరచడం లేదు. పొత్తు అంశంపైనా ఆ పార్టీ నేతలు సాగదీస్తున్నారు. ఘోర ఓటమి తప్పదని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో చంద్రబాబుతో ప్రయాణించకుండా ఉంటేనే మేలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. బీజేపీ నుంచి తనకు తీవ్ర వ్యతిరేకత వస్తున్నా చంద్రబాబు మాత్రం సిగ్గు విడిచి పొత్తు పెట్టుకోవాలని ఢిల్లీ చుట్టూ తిరుగుతూనే ఉన్నారని టీడీపీ వర్గాలు వాపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment