మోదీ-షా మార్క్‌ రాజకీయం.. చంద్రబాబుకు చెక్‌! | TDP Chandrababu False Political Comments Over BJP In Past | Sakshi
Sakshi News home page

మోదీ-షా మార్క్‌ రాజకీయం.. చంద్రబాబుకు చెక్‌!

Published Sun, Feb 25 2024 12:02 PM | Last Updated on Sun, Feb 25 2024 12:35 PM

TDP Chandrababu False Political Comments Over BJP In Past - Sakshi

రాజకీయ నాయకుడికి ఉండాల్సింది విశ్వసనీయత. రాజకీయ నాయకుడికి ఉండకూడదని సిగ్గు, ఎగ్గు. టీడీపీ అధినేత చంద్రబాబు తొలి నుంచి బలంగా నమ్మేది ఇదే. మామకి వెన్నుపోటు నుంచి, పొత్తు రాజకీయాల దాకా చంద్రబాబు ఎదుగదల వెనుక ఉన్నది ఇదే ఫార్ములా. నిజానికి సింగిల్‌గా ప్రజల ముందుకు వెళ్లే ధైర్యం చంద్రబాబు ఎప్పుడూ ప్రదర్శించలేదు. తనకంత స్థాయి, నిజాయితీ లేవని ఆయనకి బాగా తెలుసు. ఈసారి కూడా ఎలాగైనా బీజేపీ నీడలో, మోదీ ఇమేజ్‌ని వాడేసుకోవాలని చాలా ప్రయత్నించారు. కానీ, నడుస్తోన్న రాజకీయం మాత్రం మరోలా ఉంది. 

చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ సింగిల్‌గా ప్రజల ముందుకు వెళ్లలేదు. ఎన్నికల సమరంలో తలపడ లేదు. అసలు ముఖ్యమంత్రి అవడమే అత్యంత హేయమైన పద్ధతిలో అయ్యారు. మామకి వెన్నుపోటు పొడిచి తొలిసారి సీఎం సీటులో కూర్చుకున్నారు. 1999 ఎన్నికల్లో కార్గిల్‌ యుద్ధం తాలుకూ వైబ్రేషన్స్‌ బీజేపీ ఇమేజ్‌కి బాగా పెంచాయి. అలానే రెండుసార్లు వాజ్‌పేయ్‌ ప్రభుత్వం పడిపోవడంతో ఆ సానుభూతి కూడా బలంగా ఉంది.

నాడు బీజేపీతో పొత్తు పెట్టుకుని, కార్గిల్‌ వార్ సెంటిమెంట్‌ని వాడుకుని అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు. 2004లో ముందస్తు ఎన్నికలకు సై అన్న చంద్రబాబు.. ఎన్డీఏని కూడా అందులోకి లాగాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ మనదే విజయం అన్న చంద్రబాబు మాటలకు వాజ్‌పేయ్‌ కూడా ముందస్తుకి జై కొట్టారు. చివరకు టీడీపీతో పాటు ఎన్డీఏని కూడా చంద్రబాబు నిండా ముంచేశారు.

ఎన్డీఏ ఓటమి పాలైన వెంటనే యూటర్న్‌ తీసుకున్న చంద్రబాబు.. మసీదులు కూల్చే పార్టీతో మళ్లీ జతకట్టేది లేదని బీరాలు పలికారు. గుజరాత్‌ అల్లర్ల వల్లే ఎన్డీఏ ఓడిపోయిందని.. నాటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీ మీద కూడా విమర్శలు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని పొరపాటు చేశామన్నారు. మైనార్టీల ప్రయోజనాలే తనకు ముఖ్యమని తేల్చి చెప్పారు. 2009లోనూ ఓటమి పాలవడంతో.. 2014లో మళ్లీ బీజేపీకి జై కొట్టారు చంద్రబాబు. 

గుజరాత్‌ అభివృద్ధి నమూనా కేంద్రంగా దేశవ్యాప్తంగా బీజేపీకి పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ స్టార్ట్‌ అయ్యాయి. దీన్ని గ్రహించిన చంద్రబాబు.. మోదీ ఇమేజ్‌ని వాడుకుని 2014లో గెలిచారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామా చేసి పోరాటం చేయడంతో.. బీజేపీతో కలిసి ఉంటే ఇబ్బంది అనుకుని.. మళ్లీ నరేంద్ర మోదీ మీద నానా మాటలు అంటూ ఎన్టీఏ నుంచి బయటకొచ్చారు. మోదీ మీద వ్యక్తిగతంగానూ దాటికి దిగారు. నరేంద్ర మోదీని ఢీకొట్టే సత్తా ఉన్న నాయకుడ్ని అంటూ నానా ఫోజులు కొట్టడం మాత్రమే కాదు. కేంద్ర హోం మంత్రి హోదాలో అమిత్‌ షా తిరుపతి వస్తే రాళ్లు వేయించిన నీచ చరిత్ర కూడా చంద్రబాబుదే. 

2014 నుంచి ఐదేళ్ల కాలంలో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేసిన అవినీతి అనకొండ చంద్రబాబు. హోం మంత్రి అమిత్‌ షా మీద అవినీతి ఆరోపణలు చేశారు. చంద్రబాబు అసలు స్వరూపం గ్రహించిన ఏపీ ప్రజలు 2019 ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడించారు. ఆ ఎన్నికల్లో ఓడిపోగానే.. మళ్లీ బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. నలుగురు రాజ్యసభ సభ్యలను బీజేపీలోకి పంపించి.. తన ఆపరేషన్‌ మొదలు పెట్టారు. నాటి నుంచి బీజేపీకి దగ్గర కావడానికి చంద్రబాబు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. కమలనాథులు మాత్రం దూరం పెడుతూనే వచ్చారు. ఇటు దత్తపుత్రుడు చేత, అటు పురంధేశ్వరి చేత విశ్వప్రయత్నమే చేశారు. చివరకు కాళ్ల బేరం ఎపిసోడ్‌ని కూడా తన రేంజ్‌లో పూర్తి చేశారు చంద్రబాబు. అయితే, బీజేపీ మౌనంగానే ఉండటంపై రాజకీయ వర్గాల్లో సీరియస్ డిస్కషన్‌ సాగుతోంది. 

2004 ఓటమి తర్వాత బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అని తిట్టింది చంద్రబాబే. గోద్రా అల్లర్లకు మోదీనే కారణమన్నది చంద్రబాబే. నా మైనార్టీలకు బీజేపీతో ప్రమాదముందని తెగ నటించింది చంద్రబాబే. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ జిందాబాద్‌ అంటూ చిందులేసింది చంద్రబాబే. గెలిచిన తర్వాత మళ్లీ మోదీని, అమిత్‌ షాని నానా మాటలు అంటూ బయటకొచ్చింది చంద్రబాబే. ఇప్పుడు ఢిల్లీలో పాహిమాం అంటూ కాళ్ల బేరానికి వెళ్లిందీ చంద్రబాబు. 

బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు ఒకలా, బీజేపీకి దూరంగా ఉన్నప్పుడు ఒకలా మైనార్టీలతో వ్యవహరిస్తూ, వాళ్లని మోసం చేస్తూ వచ్చారు చంద్రబాబు. ఇప్పుడు బీజేపీతో పొత్తు లేకపోతే మోదీ, అమిత్‌ షాలను చంద్రబాబు టార్గెట్‌ చేస్తారా ? లేదా ? అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తన మీద, పవన్‌ కళ్యాణ్‌ మీద తెలుగు ప్రజలకు ఏమాత్రం విశ్వసనీయత లేదని గ్రహించిన చంద్రబాబు.. మోదీ ఇమేజ్‌ని ఈసారి తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని విశ్వప్రయత్నం చేశారు. కానీ, బీజేపీ లేకుండానే అభ్యర్థులను ప్రకటించే దాకా విషయం వచ్చేసింది. చంద్రబాబుతో పొత్తుకి కూడా బీజేపీ సిద్ధంగా లేదన్న వార్తలతో పార్టీకి మరింత నష్టం తప్పదని క్యాడర్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement