సాక్షి, అమరావతి: ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనేందుకు ఏమాత్రం ధైర్యం చాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు బీజేపీ పాదాలపై పడి శరణు కోరుతున్నారు. తనతో పొత్తు పెట్టుకుంటే ఎన్ని స్థానాలు ఇచ్చేందుకైనా సిద్ధమని ఇప్పటికే బీజేపీ పెద్దలకు స్పష్టమైన సంకేతాలు పంపారు. పొత్తుకు అంగీకరిస్తే వాళ్లు కోరిన సీట్లు పోగా మిగిలిన సీట్లలోనే పోటీకి బాబు సంసిద్ధమయ్యారు. అందులో భాగంగానే ఢిల్లీ వెళ్లి కమలం పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఆయన ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. రెండురోజులు అక్కడే ఉండి పొత్తు ఖరారు చేసుకుంటారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఆరు లోక్‌సభ, పది అసెంబ్లీ స్థానాల కేటాయింపునకు రెడీ
అయితే బీజేపీ పెద్దలు చర్చలకు పిలిస్తే చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారా, లేక ఆయనంతట ఆయనే వెళుతున్నారా అనే విషయం మాత్రం తెలియలేదు. ఆయన ఎవరిని కలుస్తారనే దానిపైనా స్పష్టత లేదు. మధ్యవర్తుల కోరిక మేరకు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసేందుకు యత్నిస్తారనే ప్రచారం జరుగుతోంది. యత్నాలు ఫలిస్తే కలవడానికి అవకాశం ఉంటుందని, లేకపోతే బాబు తిరుగుముఖం పడతారని చెబుతున్నారు. ఆరు లోక్‌సభ, పది అసెంబ్లీ స్థానాలు బీజేపీకి కేటాయించేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
కాషాయ పార్టీ కటాక్షించేనా!
ఇప్పటికే పవన్ కళ్యాణ్‌తో ఉమ్మడి ప్రయాణం చేస్తున్న చంద్రబాబు జనసేనతో మాత్రమే జతకడితే సరిపోదని భావించి కాషాయ పార్టీనీ కలుపుకోవాలని చూస్తున్నారు. బీజేపీకి దేశవ్యాప్తంగా ఉన్న అనుకూలత కలిసి వస్తుందని భావిస్తున్నారు. అందరినీ కలుపుకుంటే తప్ప అమిత ప్రజాభిమానం గల వైఎస్ జగన్‌కు కొద్దిగానైనా పోటీ ఇవ్వగలమనే విస్పష్ట అంచనాకు బాబు వచ్చారని తెలుస్తోంది. ఈ విషయాన్ని బాబు, పవన్ చాలా సందర్భాల్లో వెల్లడించారు కూడా.
ఇప్పటికే బీజేపీలోని తన కోవర్టుల ద్వారా ప్రధాని మోదీని కలిసేందుకు బాబు చేయని యత్నం లేదు. పవన్ ద్వారా కూడా బీజేపీ పెద్దలకు సంకేతాలు పంపుతున్నారు. బీజేపీ కటాక్షిస్తే ఆ పార్టీ పెట్టే ఏ డిమాండ్‌కైనా ఒప్పుకోవాలని బాబు, పవన్ చాలాకాలం క్రితమే నిర్ణయించుకున్నారని సమాచారం. ఆదివారం రెండు విడతలుగా జరిగిన చర్చల్లోనూ దీనిపై వారిద్దరూ చర్చించుకున్నట్లు తెలిసింది. ఆదివారం ఎంపీ బాలశౌరి జనసేనలో చేరిన సందర్భంగానూ పవన్ ఇదే విషయాన్ని బయటపెట్టారు.
20 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల్లో పోటీకి పవన్ ఒకే !
మరోవైపు జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలనే దానిపైనా చంద్రబాబు ఒక అభిప్రాయానికి వచ్చారు. పవన్ 50కిపైగా సీట్లు అడుగుతున్నా 20 వరకు అసెంబ్లీ, రెండు లోక్‌సభ సీట్లు ఇచ్చేందుకు బాబు సుముఖంగా ఉన్నారని, దీనికి పవన్ కూడా ఒకే చెప్పారని తెలుస్తోంది. ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నామనేది ప్రధానం కాదని, పోటీ చేసిన సీట్లలో గెలవాలని పవన్ చెప్పిన విషయం తెలిసిందే.
అంటే బాబు ఎన్ని సీట్లు ఇస్తే అన్ని తీసుకునేందుకు అంగీకరించిన పవన్ తన క్యాడర్‌నూ అందుకు సంసిద్ధం చేసేందుకు యత్నిస్తున్నట్టు స్పష్టమవుతోంది. దీనిపై క్షేత్రస్థాయిలో జనసేన నేతలు, క్యాడర్ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా.. ఆయన లెక్కచేయడంలేదు. మరోవైపు బీజేపీతో పొత్తుకు బాబు తహతహలాడడంపై టీడీపీలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రాన్ని బీజేపీ మోసం చేసిందని ఇప్పటివరకు చెబుతూ ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఏమిటని పలువురు నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో చులకనవుతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శరణు.. శరణు.. బీజేపీ కోసం చంద్రబాబు పాట్లు
Published Wed, Feb 7 2024 5:26 AM | Last Updated on Wed, Feb 7 2024 5:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment