
సమావేశంలో మాట్లాడుతున్న కాటసాని
సంజామల: దేశవ్యాప్తంగా అవినీతి ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు అగ్రస్థానంలో ఉన్నారని, సిగ్గుమాలిన సీఎంగా పేరు తెచ్చుకున్నారని వైఎస్సార్‌సీపీ బనగానపల్లె నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు. సంజామల మండల బూత్ కమిటీల సమావేశాన్ని ఆదివారం కోవెలకుంట్ల వీఆర్, ఎన్‌ఆర్ పంక్షన్ హాలులో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ అధికారం అండగా టీడీపీ నాయకులు సంపాదనలో పోటీపడుతున్నారని ఆరోపించారు. ప్రారంభంలో పార్టీ కార్యకర్తలకు పూలు, పత్తెర ఇచ్చినట్లుగా పనులు కట్టబెట్టిన ఎమ్మెల్యే ఇప్పుడు తానే చేసుకుంటుండటంతో సొంత పార్టీలోనే అసంతృప్తి నెలకొందన్నారు. ఇదే సమయంలో పనులు ఇస్తామని వైఎస్సార్‌సీపీ నాయకులను కూడా ప్రలోభాలకు గురిచేస్తున్నారన్నారు.
సొంత పార్టీ కార్యకర్తలకే న్యాయం చేయలేని ఎమ్మెల్యే ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకులకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. సంజామల మండలం పాలేరువాగు ముంపుతో ఏటా పొలాలు నీట మునుగుతున్నా నీరు– చెట్టు కింద తూతూ మంత్రంగా పనులు చేపట్టి డబ్బులు దండుకుంటున్నారే తప్ప సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టలేదన్నారు. ప్రతి గ్రామంలో ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని, దొంగఓట్లుంటే తొలగించేందుకు సిఫారసు చేయాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చిన కాటసాని.. మాట తప్పితే రాజకీయాల నుంచి తప్పుకుంటామని ప్రకటించారు. గ్రూప్–1 రిటైర్డ్ అధికారి నరసింహం మాట్లాడుతూ వైఎస్సార్ కలలు గన్న గ్రామీణ స్వరాజ్యం రావాలంటే వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు.
తండ్రి ఆశయ సాధన కోసం పోరాడుతున్న జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. భవిష్యత్తు వైఎస్సార్‌సీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుండం వెంకట సూర్యప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ నేతలు పోలీసులు, అధికారులపై ఒత్తిడి తెచ్చి సంక్షేమ ఫలాలు పేదలను కాదని సొంతపార్టీ కార్యకర్తలకు అందేలా చేస్తున్నారని దుయ్యబట్టారు. ముక్కమల్ల సర్పంచ్ పోచా వెంకటరామిరెడ్డి, సీనియర్ డాక్టర్ రామిరెడ్డి, ఎంపీపీ గౌరుగారి ఓబుళరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు చిన్నబాబు, నాయకులు గాధంశెట్టి రమణయ్య, రెడ్డిపల్లె సూర్యనారాయణరెడ్డి, నరసింహారెడ్డి, కానాల వీరశేఖర్‌రెడ్డి, బత్తుల రామచంద్రారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment