అభివృద్ధి యజ్ఞం ఆగొద్దు | KCR Emotional Speech At Pragathi Nivedana Sabha In Kongarkalan | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 3 2018 1:46 AM | Last Updated on Mon, Sep 3 2018 6:31 AM

KCR Emotional Speech At Pragathi Nivedana Sabha In Kongarkalan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ సమాజ సంక్షేమమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి యజ్ఞం ఆగకూడదని, కొనసాగించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణను త్వరలోనే సాకారం చేస్తామన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో జరిగిన ప్రగతి నివేదన సభలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు కేసీఆర్‌ వివరించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..

చిమ్మచీకట్లను చీల్చుకుని..
‘‘ఉద్యమ సమయంలో ఒకసారి ఢిల్లీలో ఉన్నప్పుడు జయశంకర్‌గారు, విద్యాసాగర్‌రావుగారు, నేను.. తెలంగాణ వచ్చాక ఏం చేయాలనే విషయంపై చర్చ మొదలుపెట్టాం. రాత్రి ఒంటి గంట అయింది. అప్పుడు విద్యాసాగర్‌రావు.. ‘తెలంగాణ వచ్చాక మిగిలింది ఆలోచిద్దాం. మీరు పడుకోండి’ అన్నారు. జయశంకర్‌సారు నేను అలాగే చర్చించుకుంటు న్నాం. మూడున్నరకు విద్యాసాగర్‌రావుగారు వచ్చి.. ‘మీరింకా పడుకోలేదా’ అన్నరు. అప్పుడూ చర్చ కొనసాగించాం. తెలంగాణ పరిస్థితులను, ఆత్మను జయశంకర్‌ సార్‌ అణువణువు అన్వేషించారు.

చెరువుల విధ్వంసంతో భూగర్భ జలాలు అడుగంటిపోయిన వైనాన్ని.. కరెంటు పరిస్థితులను చర్చించాం. జయశంకర్‌సార్‌తో చర్చించిన సమయంలో భూగర్భ జలాల సమస్యను గుర్తించి మిషన్‌ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టాం. కరెంటు విషయంలోనూ అంతే. తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంటు బాధలు ఉంటాయని సమైక్య పాలకులు అన్నరు. అప్పటి సమైక్య సీఎం ఒకరు తెలంగాణలో కరెంటు ఉండదని కట్టె పెట్టి చూపించారు. శాశ్వతంగా అలాగే ఉంటుందనే అన్నారు. తెలంగాణ రాష్ట్రం చిమ్మచీకట్ల నుంచి 24 గంటలు కరెంటుతో వెలుగు జిలుగులతో వరాజిల్లుతోంది. దేశంలో అన్ని రంగాలకు నిరంతరంగా, వ్యవసాయానికి ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. త్వరలోనే తెలంగాణను విద్యుత్‌ మిగులు రాష్ట్రంగా మార్చుతామని హామీ ఇస్తున్నా.

ఏమైతోందని ఏడ్చిన..
సమైక్య పాలనలో తెలంగాణ జీవన విధ్వంసం అంతాఇంతా కాదు. అనేకసార్లు ఆలోచించా. ఏమైతోందని ఏడ్చిన. సిరిసిల్లకు పోయినప్పుడు అక్కడ గోడలపై ‘చేనేత కార్మికుల ఆత్మహత్యలు వద్దు’ అని కలెక్టర్‌ రాయించిన దృశ్యాలు కంటబడ్డాయి. 70 ఏళ్ల స్వాతంత్య్రంలో చావులు గోడలపై చూడాల్సిన పరిస్థితికి బాధపడ్డా. పోచంపల్లిలో ఒకేరోజు ఏడుగురు చేనేత కార్మికులు విషంతాగి చనిపోయారు. ఆ కుటుంబాలను ఆదుకోవాలని అప్పటి ముఖ్యమంత్రిని కోరినా పట్టించుకోలేదు. భిక్షాటన చేసి రూ.మూడు నాలుగు లక్షలు ఇచ్చి అండగా ఉన్నం. సిరిసిల్లలో ఒకేరోజు 11 మంది చేనేత కార్మికులు చనిపోతే టీఆర్‌ఎస్‌ తరఫున మేమే ట్రస్టు పెట్టి ఆదుకున్నం. ప్రాణాలు తీసుకోవద్దు.. తెలంగాణ వచ్చేదాకా ఆగాలని కోరిన. ఇప్పుడు ఇయ్యాల తెలంగాణలో నేతన్నల ముఖాలు వెలిగిపోతున్నాయి. బతుకమ్మ చీరలు, ప్రభుత్వ గురుకులాలు, పాఠశాల విద్యార్థుల యూనిఫారా లతో జీవన భద్రత వచ్చింది. నెలకు రూ.17 వేల నుంచి రూ.20 వేలకు ఆదాయం వస్తోంది.

గొర్రెలు, బర్రెలు పెంచడం గొప్ప వృత్తే..
ఉమ్మడి రాష్ట్రంలో చీప్‌ లిక్కర్‌ కంపెనీలతో ప్రభు త్వాలు కుమ్మక్కై హైదరాబాద్‌లో కల్లు డిపోలను మూసేయించాయి. కోర్టులు తీర్పు ఇచ్చినా పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక తాటి చెట్లపై వసూలు చేసే పన్నును రద్దు చేశాం. కల్లు గీత కార్మికులకు అండగా నిలుస్తున్నాం. నయా ఆర్థిక వేత్తలు ఐటీ, పారిశ్రామిక అభివృద్ధినే అభివృద్ధి అంటున్నారు. గొర్రెలు, బర్రెలు పెంచడం కూడా గొప్ప వృత్తే. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో 70 లక్షల గొర్రెల ను పంపిణీ చేశాం. వాటికి 30 లక్షల పిల్లలు పుట్టాయి. మొత్తంగా రాష్ట్రంలోని గొల్లకుర్మలు రూ.1,500 కోట్లు సంపాదించారు. 2.11 లక్షల మంది రైతులకు పాడి గేదెలు పంపిణీ చేశాం.

ఆడపిల్లల పాదాలు కడిగి చూపిస్తం
‘వచ్చే ఎన్నికల్లోపు ఇంటింటికీ మంచినీళ్లు ఇయ్యకపోతే ఓట్లు అడగం’ అని దేశంలో ఏ ము ఖ్యమంత్రీ చెప్పలేదు. మిషన్‌ భగీరథ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌తో ఇప్పుడే మాట్లాడా. 22 వేల గ్రామా లకు నీరు ఇస్తున్నట్లు చెప్పారు. మరో 1,300 గ్రామాల పనులు పూర్తవుతున్నాయి. ఎన్నికలకు ఆరు నెలల ముందే నీళ్లు సరఫరా చేస్తాం. ఆడపి ల్లల పాదాలు కడిగి చూపిస్తం. పాలమూరు, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేయడంతో వలసపోయిన పేద కుటుంబాలు తిరిగి ఊళ్లోకి వస్తున్నాయి. మంత్రి హరీశ్‌రావు పట్టుదలతో లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు వచ్చింది. పాలమూరు జిల్లాలో రేషన్‌ కార్డులను బదిలీ చేయాలని దరఖాస్తులు పెట్టుకుం టున్నారు. భవిష్యత్‌ ఇంకా ఉంది.

కీమానాయక్‌ కన్నీళ్లు.. కల్యాణలక్ష్మికి నాంది..
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక 465 కార్యక్రమాలు ప్రారంభించాం. అనేక విషయాలు ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే తెల్లారుతుంది. ఉద్యమ సమయంలో నేను, మంత్రి చందులాల్‌ కలిసి ములుగులో ఒక తండాకు వెళ్లాం. అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయిన బానోత్‌ కీమానాయక్‌ ఒక్కతీరుగా దుఃఖటిల్లాడు. ఏమైందని అడిగిన. ‘శ్రీరామనవమి తర్వాత బిడ్డ పెళ్లి చేసేందుకు ఇంట్లో రూ.50 వేలు పెట్టిన. అంతా బూడిదైంది’ అన్నడు. నేను పెళ్లి చేస్త అని భరోసా ఇచ్చిన. అన్నట్లుగానే రూ.లక్ష పంపించిన. పెళ్లికి వెళ్లిన. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చందాలు వసూలు చేసి ఎస్సీ, ఎస్టీ బిడ్డల పెళ్లిళ్లు చేయించిన. ఆడపిల్ల గుండెలమీద కుంపటి కాదని చెప్పేందుకే కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు ప్రారంభించాం.

శాశ్వత ధనిక రాష్ట్రం కావాలె..
ఎప్పుడైనా రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు కొత్త నిర్ణయాలు తీసుకుంటాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మొదటి మంత్రివర్గ సమావేశంలోనే 42 నిర్ణయాలు తీసుకున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా మరో 72 అంశాలను అమలు చేస్తున్నాం. రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, వృత్తి కులాల పథకాలు వంటివి మేనిఫెస్టోలో పెట్టలేదు. నాయీ బ్రాహ్మణులకు సెలూన్లకు సరఫరా చేసే కరెంటును కమర్షియల్‌ నుంచి మార్చి తక్కువ చార్జీలు అయ్యేలా రాయితీ ఇస్తున్నాం. కేజీ నుంచి పీజీ విధానంలో భాగంగా అన్ని వర్గాలకు గురుకులాలను నిర్మిస్తున్నాం. గిరిజన తండాల, గోండు గూడాల సుదీర్ఘ ఆకాంక్ష అయిన ప్రత్యేక గ్రామ పంచాయతీలను సాకారం చేశాం. ‘మావ నాటే.. మావ రాజ్‌’ అనే నినాదాన్ని ఆచరణలోకి తెచ్చేలా వారే పరిపాలించేలా నిర్ణయం తీసుకున్నాం. సంక్షేమ, తక్షణ ఉపశమన కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఇవి సరిపోవు. తెలంగాణ రాష్ట్రం శాశ్వత ధనిక రాష్ట్రంగా ఉండాలి. కోటి ఎకరాలకు నీరు అందిస్తాం. ఈ దిశగా కొన్ని ప్రాజెక్టులు చేపట్టాం. పాలమూరు, కాళేశ్వరం, దేవాదుల, సీతారామసాగర్‌ పూర్తవుతున్నాయి.

గంధర్వులు రాలే.. హిమాలయాలకు పోయి రాలే..
కొత్త కుండలో ఈగ సొచ్చినట్లు రాష్ట్రం వచ్చిన కొత్తలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. దృక్పథం మారితే ఫలితాలు ఉంటాయి. వరుసగా నాలుగేళ్లు ఆర్థిక వృద్ధిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. 2018–19లో ఇప్పటి వరకు వృద్ధిరేటు 17.83 శాతం ఉంది. బ్రహ్మాండంగా ఆదాయం పెరుగుతోంది. అప్పటికీ ఇప్పటికీ అదే తేడా. గంధర్వులు రాలేదు. హిమాలయాల్లో చెట్ల రసం తాగి రాలేదు. మారిందల్లా దృక్పథమే. పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో నేతల అవినీతి చూశాం. ఎన్నో ఉన్నాయి.. ఒక్క ఇసుక విషయం చెప్పుకుందాం. పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఇసుకపై ప్రభుత్వానికి రూ.10 కోట్ల ఆదాయం వచ్చింది. టీఆర్‌ఎస్‌ నాలుగున్నరేళ్ల పాలనలో రూ.1,980 కోట్ల ఆదాయం వచ్చింది. రాజకీయ అవినీతిని నిర్మూలించి, కడుపు మాడ్చుకుని, నోరు కట్టుకుని పని చేస్తే ఇలా అయ్యింది. పెంచిన సంపద ప్రజలకు పంచుతాం.

సొల్లు పురాణం చెప్పను.. అన్నీ మీ కళ్ల ముందే ఉన్నయి..
మైనారిటీల సంక్షేమంలో మన రాష్ట్రం ఎంతో చేస్తోంది. మైనారిటీ సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.4 వేల కోట్లు కేటాయించింది. మన రాష్ట్ర ప్రభుత్వం రూ.రెండు వేల కోట్లను కేటాయించింది. నేను మాటలు చెప్పడం కాదు. అభివృద్ధి, చెరువులు, కరెంటు, నీళ్లు, నిర్మించే ప్రాజెక్టులు మీ దగ్గరే ఉంటున్నాయి. కృష్ణా, గోదావరి నీళ్లు మీ ఇంటికే వస్తున్నయి. ప్రాజెక్టులు కట్టడం మీ కళ్ల ముందే ఉంది. సొల్లు పురాణం నేను చెప్పను. అన్నీ మీ కళ్ల ముందే ఉన్నాయి. ప్రగతి నివేదిన మీ ముందే ఉంది. కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణ సాకారం కావాలె. ఐటీ, పరిశ్రమలు అభివృద్ధి చెందాలె. యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగాలె. బంగారు తెలంగాణ, అభివృద్ధి తెలంగాణ, సంక్షేమ తెలంగాణ కావాలె. గొప్పగా బాగుపడదాం అనుకున్నాం. ఇప్పటికే బాగుపడ్డాం. అయినా అభివృద్ధి యజ్ఞం ఆగకూడదు. కొనసాగాలి’’ అని సీఎం వివరించారు.  

తెలంగాణ వచ్చినంత సంతోషపడ్డా..
తెలంగాణలో కొత్త జోనల్‌ విధానానికి ఆమోదం దక్కిన విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన రోజు నా గుండెల నిండా ఎంత సంతోషపడ్డానో జోనల్‌ విధానం ఆమోదం పొందినప్పడు అదే అనుభూతి పొందా. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చే విషయంలో కేంద్రం ఊగిసలాటలో ఉంటే చేస్తవా చస్తవా అని ప్రధాని నరేంద్ర మోదీని బల్లగుద్ది అడిగినం. ఇది మా రాజ్యంగ హక్కు అని తెచ్చు కున్నం. స్వరాష్ట్రం మనకు సాధించిన విజయమిది. కేసీఆర్, టీఆర్‌ఎస్‌ లేకపోతే 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కేలా నిర్ణయం వచ్చేదా. తెలంగాణ రాష్ట్ర ప్రజలపై టీఆర్‌ఎస్‌కు ఉన్న నిబద్ధత ఇది’’ అని ఆయన అన్నారు.

రైతులు ధనికులయ్యే వరకు..
కోటి ఎకరాలకు నీరు అందిస్తా. రైతులు మీదికి భుజాన కండువా ఏసుకుని పైకి పటేలా అన్నట్లు కనిపిస్తరు. కానీ అప్పులు ఉంటయి. అందుకే ఉచితంగా కరెంటు, పెట్టుబడి ఇయ్యాలె. కొన్నేళ్లు ఇలా చేస్తేనే రైతులకు అప్పులు చెల్లించుకుంటారు. ఆ తర్వాత కొంత ఆదాయం పొందుతరు. 80 ఏళ్లలో ఏ ప్రభుత్వం సాహసం చేయని రీతిలో భూ రికార్డుల ప్రక్షాళన చేశాం. ఈ నివేదికల ఆధారంగా రూ.5,500 కోట్లను మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా వెళ్లి రైతులకు ఇచ్చారు. రైతు ధనికులు అయ్యేంత వరకు ఇలా చేయాలి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్నంత కాలం రైతు బంధు పథకం ఉంటుంది. నవంబర్‌లో రెండో విడత రైతు బంధు సాయం అందిస్తం. రైతులు చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దు. ఆ ఆలోచనతోనే రైతు బీమా అమలు చేస్తున్నాం. ఇప్పటికి 365 మంది రైతు కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పున అందించాం. రైతు చనిపోయిన పది రోజుల్లో ఇవ్వాలని చెప్పినా.. నాలుగైదు రోజుల్లోనే ఇస్తున్నారు. రుణమాఫీ, ప్రాజెక్టులు, కరెంటు, ఇంకా కొన్ని మంచి పనులు చేయాలె. దీని కోసం ఖలేజా, సాహసం ఉండాలె.

కనులన్నీ కలాన్‌పైనే..!
సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రగతి నివేదన సభపై రోజంతా ఉత్కంఠ కొనసాగింది. ప్రభుత్వ వర్గాల్లో గత నాలుగు రోజుల నుంచే ముందస్తు హడావుడి కనిపించడం, సభకు ముందే మంత్రి మండలి సమావేశం కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నట్లు సభకు 25 లక్షల మంది వస్తారా? వారినెలా తీసుకొస్తున్నారు? అంతా ఊహించినట్టుగానే కేసీఆర్‌ ముందస్తుకు వెళ్లనున్నారా? ప్రగతి నివేదన సభ సాక్షిగా ఏ వర్గానికి ఎలాంటి వరాలు కురిపించనున్నారు? తొలి జాబితాలో ఎవరెవరికీ టికెట్లు ప్రకటించనున్నారు? ఎన్నికల మేనిఫెస్టోలో ఏం ఉండబోతోంది? వంటి అంశాలపై సహజంగానే ఆయా వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్‌ నిజంగానే ముందస్తుగాకు వెళ్తే.. ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు..? వంటి అంశాలపై ఆంధ్రప్రదేశ్‌ సహా దేశం మొత్తం దృష్టి సారించింది. లక్షలాది మంది సభకు వెళ్లారు. మరెందరో రోజంతా టీవీలకు అతుక్కుపోయారు. మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రులు.. తాము తీసుకున్న నిర్ణయాలు వెల్లడించారు. సభలో ఆశించిన స్థాయిలో ఉద్వేగపూరితమైన ప్రసంగాలేవీ లేకపోవడం.. ముందస్తుకు సంబంధించిన ప్రకటన ఏదీ చేయకపోవడం కొసమెరుపు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement