సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు లేని కూటమి ప్రభుత్వ ఏర్పాటే తమ లక్ష్యమని తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. అదే కేసీఆర్ మిషన్ అని ఆయన వెల్లడించారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా త్వరలోనే పూర్తి స్థాయి ప్రణాళిక వెల్లడిస్తామని సీఎం స్పష్టం చేశారు. ‘ఫెడరల్ ఫ్రంట్’రూపకల్పనలో భాగంగా వివిధ రాష్ట్రాల పర్యటన ప్రారంభించిన సీఎం కేసీఆర్ సోమవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో ఆ రాష్ట్ర సచివాలయంలో సమావేశమయ్యారు.
అనంతరం మమతతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘జాతీయ రాజకీయాలపై, ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించాం. సమావేశం ఫలప్రదంగా జరిగింది. ఇకపైనా చర్చలు ఇలాగే కొనసాగిస్తాం. కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలన్నదే మా లక్ష్యం. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలంటే ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సినv అవసరం ఉంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై నిన్నటి నుంచే చర్చలు ప్రారంభమయ్యాయి. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో భేటీ అయ్యాను. ఇప్పుడు మమతా బెనర్జీని కలిశాను. తెలంగాణ ఎన్నికల్లో గెలిచాక మమత నాకు శుభాకాంక్షలు తెలిపారు.
నేను కృతజ్ఞతలు తెలిపాను. ఇప్పుడు ఇద్దరం కలిసి పరస్పర ప్రయోజనాలు, జాతీయ ప్రయోజనాలపై చర్చించాం. ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి దాని బలోపేతం కోసం కృషి చేస్తాం. కేసీఆర్ మిషన్ ఏంటని మీరు అడుగుతున్నారుగా.. బీజేపీ, కాంగ్రెస్ ప్రమేయంలేని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటే మా మిషన్. ఫెడరల్ ఫ్రంట్ అంటే ఆదరాబాదరాగా చేయాల్సింది కాదు. ఇక ముందు కూడా చర్చలు కొనసాగుతాయి. అన్ని విషయాలు ఆచరణలోకి వస్తాయి. త్వరలో పూర్తి స్థాయి ప్రణాళికతో మీ ముందుకు వస్తాం. మంచి వార్త చెబుతాం’అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అంతకుముందు కేసీఆర్‌కు పశ్చిమ బెంగాల్ సీఎం, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
పూరీలో పూజలు...
ఒడిశాలో ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్ నివాసంలో బస చేసిన సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు.. సోమవారం ఉదయం భువనేశ్వర్ నుంచి పూరీ చేరుకున్నారు. పూరీ ఆలయ అధికారుల సీఎం కేసీఆర్‌కుు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి జగన్నాథస్వామిని కేసీఆర్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి తిరిగి భువనేశ్వర్‌కు చేరుకున్న కేసీఆర్.. విమానంలో కోల్‌కతాకు చేరుకున్నారు. పశ్చిమబెంగాల్ సచివాలయంలో మమతతో సమావేశం అనంతరం.. కుటుంబ సభ్యులతో కలిసి కోల్‌కతాలోని కాళీమత ఆలయాన్ని కేసీఆర్ సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
హస్తినలో కేసీఆర్ బిజీ బిజీ
మూడ్రోజుల పర్యటనలో భాగంగా కేసీఆర్ సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణ సీఎంగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం కేసీఆర్ మొదటిసారి ఢిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ పలువురు ప్రాంతీయ పార్టీల చీఫ్‌లతో సమావేశం కానున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతితో, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌యాదవ్‌తో వేర్వేరుగా భేటీ అవుతారు. 26వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని నరేంద్ర మోదీని కేసీఆర్ మర్యాద పూర్వకంగా కలుస్తారు. తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాలపై పలువురు కేంద్ర మంత్రులను కలిసి కేసీఆర్ చర్చిస్తారు. కేంద్ర ఎన్నికల కమిషనర్‌తోనూ సమావేశమవుతారు. ఈ నెల 27న సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉంది. అప్పటి పరిస్థితిని బట్టి సీఎం ఢిల్లీ పర్యటనలో మార్పులు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే!
మహాకూటమి ఏర్పాటును అడ్డుకునేందుకు కేసీఆర్ విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ విమర్శించింది. తద్వారా.. బీజేపీకి లబ్ధి జరిగేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడింది. వివిధ పక్షాలతో కూటమి ఏర్పాటుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడమే కేసీఆర్ లక్ష్యమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ ఆరోపించారు. కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ప్రాంతీయ పార్టీల సహకారంతో 2019లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన అన్నారు. కేసీఆర్ ఉచ్చులో ప్రాంతీయ పార్టీలు పడే అవకాశం లేదని సింఘ్వీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment