కేసీఆర్ జాతీయస్థాయిలో చక్రం తిప్పాలనుకోవడం చంద్రబాబుకు ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో ఘోరంగా ఓడిపోవడం ఆయన పరపతిని మంటగలిపింది. దీంతో జాతీయస్థాయి నాయకులంతా కేసీఆర్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ నాయకత్వంపై తనకేమీ కాంక్షలేదని కేసీఆర్ హుందాగా ప్రకటిస్తే మమతా బెనర్జీ, నవీన్ పట్నాయిక్, మాయావతి చాలా సంతృప్తి చెందుతారు. కేసీఆర్ నేరుగా ఏపీలో ప్రచారానికి వెళితే దుష్పరిణామాలు తప్పవు. కేసీఆర్‌ని వ్యతిరేకించాలంటూ టీడీపీ ప్రచారం చేసే అవకాశం ఉంది. సెటిలర్లతో సత్సంబంధాలు కొనసాగించడం ద్వారా కేసీఆర్ ఏపీ ప్రజల హృదయాలను గెలుచుకోవచ్చు.
‘విజయానికి చాలామంది తండ్రులుంటారు, కానీ ఓటమి మాత్రం అనాథ’ అని నెపోలియన్ అన్నట్టు కేసీఆర్ కనుక ఓడిపోయి వుంటే ఆయన గురించీ, ఆయన కుటుంబం గురించీ అందరూ జోకులేసుకుని ఉండేవారు. ఎన్నోరకాల ఆరోపణలు వెల్లువెత్తేవి. శత్రుత్వం ఉందని భావిస్తున్న రాహుల్ గాంధీ కుటుంబం కూడా కేసీఆర్ ఓటమికి సంతోషపడి ఉండేది. తెలంగాణను ఇవ్వడంతో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శాశ్వతంగా కోల్పోయింది. కానీ, కేసీఆర్ గెలవడంతో అందరూ అభినందనల వర్షం కురిపిస్తున్నారు. డిసెంబర్ 11, 2018న విజయోత్సవ ప్రసంగం చేస్తూ కేసీఆర్ రెండు రాజకీయ ప్రణాళికలను ప్రకటించారు.
కాంగ్రెస్, బీజేపీ లేని జాతీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేస్తా మని కేసీఆర్ మొదట ప్రకటించారు. బీజేపీకి కేవలం తాను మాత్రమే ప్రతిపక్షంగా ఉండాలనుకుంటున్న కాంగ్రెస్‌కు ఇది చేదు వార్తే. ఇక రెండోది తెలంగాణ రాజకీయాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ‘రిటర్న్ గిఫ్ట్’ ఇవ్వడానికి ఆంధ్రా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటాననడం.
కేసీఆర్ అన్నట్టుగానే ఈ రెండు పనులూ చేయగలరు. అయితే, ఆయన ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో విజయం ఆయనకు జాతీయ స్థాయిలో పాపులారిటీని తెచ్చిపెట్టి ఉండ వచ్చు. కానీ, విఫలమైతే తెలంగాణలో ఆయన ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది. వీటిని సాధించాలంటే తన కుటుంబ సభ్యులపైనా, పార్టీ సభ్యులపైనా కాకుండా బయటి శక్తులపై
ఆధారపడటం మంచిది.
ఆశ్చర్యకరంగా కాంగ్రెస్‌తో జతకట్టడం ద్వారా కేసీఆర్‌ను ఓడించా లని చంద్రబాబు అనుకున్నారు. కేసీఆర్‌ను ఓడించడానికి తమకు 2014లో వచ్చిన ఓట్లు సరిపోతాయని కాంగ్రెస్, టీడీపీ చెప్పుకున్నాయి. ఆ నమ్మకంతోనే తెలంగాణ పర్యటనకు వచ్చిన సోనియా గాంధీ తనను తాను ‘తెలంగాణ తల్లి’గా అభివర్ణించుకున్నారు. ఆ విధంగా లభించబోయే కాంగ్రెస్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనుకున్నారు. కానీ, రెండు, రెండు కలిపితే నాలుగు అవుతుందనే తరహా ఈశాన్య భారతపు రాజకీయ నాయకుల జిమ్మిక్కులు తెలుగు ప్రజలపై పనిచేయక చాలాకాలమైంది.
చంద్రబాబు రాహుల్ గాంధీని కలవగానే, వారిద్దరూ చాలా తెలివైనవారనీ; మహాకూటమి కేసీఆర్‌ను ఓడించితీరుతుందని చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ, దిమ్మతిరిగే ఓటమి ఎదురయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ చంద్రబాబును నిందిస్తోంది. ఆయన నుంచి వెంటనే విడాకులు తీసుకోవాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. ఓటమితో చంద్రబాబు అనాథగా మారడంతోపాటు ‘ఆంధ్రా ఐరన్ లెగ్’గా పేరుపడ్డారు. 2018 ఎన్నికల్లో 80 శాతం మంది సెటిలర్లు చంద్రబాబును ఓడించాలనే కేసీఆర్‌కు ఓటు వేయడం అత్యంత ముఖ్యమైన అంశం.
చంద్రబాబుకు పోటీగా...
ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని కేసీఆర్ చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు అది ప్రత్యామ్నాయంగా ఉంటుందని కూడా ఆయన చెప్పారు. దీంతో ఇది చంద్రబాబును సూటిగా తాకుతోంది. జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీలతో చక్రం తిప్పడంలో తనకు విస్తృతమైన అనుభవం ఉందని చంద్రబాబు ఎప్పటి నుంచో ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు ఆయనకు కేసీఆర్ పోటీదారుగా నిలిచాడు. కేసీఆర్ కూడా చక్రం తిప్పాలనుకోవడం చంద్రబాబుకు ఆందోళన కలిగిస్తోంది. సీఎంగా ప్రస్తుతం కేసీఆర్ వెలిగిపోతుండగా, బాబు భవిష్యత్ సందేహంలో ఉంది.
అందువల్ల జాతీయ నాయకులంతా కేసీఆర్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. తెలంగాణలో ఘోరంగా ఓడిపోవడం చంద్రబాబు పరపతిని మంటగలిపింది. తెలంగాణ ఓటమి తర్వాత జాతీయ నాయకులు చంద్రబాబుకు తక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తూ, పలువురు నేతలను కలుసుకుంటుండటంతో చంద్రబాబు ప్రాధాన్యత మరింత మసకబారింది.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడం వల్ల కాంగ్రెస్ పార్టీకి కూడా ఇబ్బందులు తప్పవు. ఆయనను చంద్రబాబు ఓడిస్తారని రాహుల్ నమ్మారు. కేసీఆర్ ఓడిపోతే ఆయనపై తీవ్రంగా దాడిచేయాలని కూడా రాహుల్ భావించారు. చంద్రబాబు గొప్పలను నమ్మి, విజయం ఖాయమని విశ్వసించి మోసపోయారు. కేసీఆర్‌ను మరింత పెద్ద శత్రు వును చేసుకోకుండా రాహుల్ జాగ్రత్త వహించాలి. జాతీయవేదికపై రాహుల్‌కు కేసీఆర్‌తోనే ఎక్కువ ప్రమాదం. రాహుల్‌ను తీవ్రంగా దుయ్యబట్టి ‘రిటర్న్‌గిఫ్ట్’ ఇవ్వగలిగిన స్థితిలో ప్రస్తుతం కేసీఆర్ ఉన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీల్లో స్పష్టమైన విభజన కనిపిస్తున్నందున మోదీకంటే కేసీఆరే రాహుల్‌కు ప్రధాన ప్రత్యర్థిగా నిలువనున్నారు.
మాటలు జాగ్రత్త
విజయపు కీర్తిని విజేతలే చేజేతులా తుడిచేసుకున్న ఉదాహరణలు చరిత్రనిండా కొల్లలుగా ఉన్నాయి. పెద్దపెద్ద కోరికలు ఉన్నట్టు ప్రకటించకుండా కేసీఆర్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వాన్నే కోరుకుంటున్నాగానీ, నాయకత్వంపై తనకేమీ కాంక్షలేదని హుందాగా కేసీఆర్ ప్రకటిస్తూ జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి. దీని అర్థం మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, మాయావతిలాంటి వారినెవరినైనా ప్రధానిగా అంగీకరించడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్టే. కేసీఆర్ ఇటువంటి ప్రకటన గనుక చేసినట్లయితే, వాళ్లు చాలా సంతృప్తి చెందుతారు.
మరోవైపు చంద్రబాబును రాహుల్ రహస్య ఏజెంట్‌గా భావిస్తున్నందున జాతీయ రాజకీయాలపై ఆసక్తి వున్న నేతలంతా కేసీఆర్‌తో మరింత స్నేహంగా మెలుగుతారు. కేసీఆర్ సరిగ్గానే వ్యవహరిస్తున్నప్పటికీ చాలా ప్రాంతీయ పార్టీలు ఫెడరల్ ఫ్రంట్‌లో చేరకపోవచ్చు. కానీ, ఆ పార్టీలకు ఆయనపట్ల అభిమానం ఏర్పడుతుంది. అదే కేసీఆర్ సాధించగలిగే గొప్ప విజయం. దాంతో రాహుల్, చంద్రబాబుల స్థాయిని కేసీఆర్ తగ్గించగలుగుతారు. అంతేకాదు, సోనియా, రాహుల్, చంద్రబాబు ఎప్పటికీ తెలంగాణలో అడుగుపెట్టలేని పరిస్థితి ఎదుర్కొంటారు.
సెటిలర్స్‌తో జాగ్రత్త
ఏపీలో చంద్రబాబును ఓడించడం కేసీఆర్ రెండో లక్ష్యం. కేసీఆర్ లక్ష్యం సులువుగానే నెరవేరుతుంది. కాకపోతే అందుకు కేసీఆర్ ప్రత్యేకమైన ఎత్తుగడలు అనుసరించాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో టీడీపీకి చాలా వ్యతిరేకత ఉంది. చంద్రబాబు తెలంగాణలో ప్రచారానికి వచ్చినట్టే కేసీఆర్ కూడా అక్కడకు వెళితే దుష్పరిణామాలు తప్పవు. ఆంధ్ర రాజకీయాల్లో కేసీఆర్ నేరుగా జోక్యం చేసుకోకపోవడమే మేలు. ఎందుకంటే, ఉమ్మడి ఏపీలో కేసీఆర్ ఎప్పుడూ సీఎంగా లేరు. సామాన్య ప్రజానీకానికి ఆయన గురించి పూర్తిగా తెలియదు. దాంతో కేసీఆర్‌ను వ్యతిరేకించాలంటూ టీడీపీ ప్రచారం ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయి. బాబును ఓడించడానికి కేసీఆర్‌కు ఇతర మార్గాలు చాలానే ఉన్నాయి.
తెలంగాణలో లక్షలాదిమంది ఆంధ్ర సెటిలర్లు ఉన్నారు. వారికి ఏపీతో బలమైన సామాజిక, ఆర్థిక సంబంధాలున్నాయి. సెటిలర్లతో సత్సంబంధాలు కొనసాగించడం ద్వారా కేసీఆర్ ఏపీ ప్రజల హృదయాలను గెలుచుకోవచ్చు. తెలంగాణలో మైనారిటీలపట్ల చూపుతున్నట్టే సెటిలర్లపట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ చూపడంతోపాటు ప్రత్యక్ష సంబంధాలు కొనసాగించాలి. ఆంధ్ర సెటిలర్స్‌తో కేసీఆర్ సత్సంబంధాలు ఏర్పరచుకున్నట్లయితే, అది ఆంధ్ర రాజకీయాలపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది.
చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్‌ను శత్రువుగా చూపించవచ్చు. అందుకని, కేసీఆర్ బహిరంగ ప్రకటనలు చేయకుండా, ఆంధ్రలో నేరుగా పర్యటించకుండా జాగ్రత్త వహించాలి. ఆంధ్ర లోని ఏదైనా రాజకీయ పార్టీగా కేసీఆర్ మద్దతు ప్రకటిస్తే అది ఆయనకే ఎదురుతగలడంతోపాటు చంద్రబాబుకు లబ్ధి చేకూరుతుంది. కేసీఆర్ ఈ చిల్లర రాజకీయాల్లో కూరుకుపోకూడదు. వీటికి దూరంగా ఉండటం ద్వారా కేసీఆర్ తన స్థాయిని పెంచుకోవచ్చు.
మిగలని చక్రం
కాంగ్రెస్‌తోనో, బీజేపీతోనో అంటకాగాల్సిన అవసరంలేని ప్రాంతీయ పార్టీ నేతలకు ఫెడరల్ ఫ్రంట్ ఓ గొప్ప అవకాశం. మమతా బెనర్జీ, మాయావతి, నవీన్ పట్నాయక్ వంటి నేతలు, తమిళనాడులోని ఏడీఎంకే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వంటి పార్టీలు అటు బీజేపీతోనో, ఇటు కాంగ్రెస్‌తోనో జతకట్టే అవకాశం లేదు. ప్రాంతీయ పార్టీలు ఫెడరల్ ఫ్రంట్‌లో చేరకపోయినప్పటికీ వాటి మద్దతు మాత్రం తప్పకుండా ఉంటుంది. మమతా బెనర్జీ వంటి నేతలు నేరుగా కాంగ్రెస్‌కు ఎదురు నిలువక పోయినా, బీజేపీ వ్యతిరేక ఓట్లను చీలుస్తామనే సందేశాన్నిస్తారు. దీంతో జాతీయ నాయకులుగా ఎదగడానికి కాంగ్రెస్ ఆసరా అవసరం లేదని, తమకు చాలా ప్రాంతీయ పార్టీల మద్దతు ఉందని వారు చాటుకోవడానికి వీలవుతుంది.
చంద్రబాబు అత్యుత్సాహం చూపితే ఇతర పార్టీలు దూరం జరిగే అవకాశం ఉందని ఇప్పటికే మమతా, మాయావతి స్పష్టం చేశారు. దీంతో జాతీయ వేదికపై చంద్రబాబు స్థాయిని తగ్గించడం ద్వారా కేసీఆర్ ఇప్పటికే చిన్నపాటి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్లయింది. పాపం, ఇప్పుడు ఢిల్లీలో తిప్పడానికి చంద్రబాబుకు ఏ చక్రం మిగలలేదు. కేసీఆర్ హడావుడి పడకుండా, సందర్భానుసారం ఆచితూచి అడుగులు వేస్తే జాతీయ స్థాయిలో కూడా మంచి ఫలితాలు పొందడం ఖాయం.
వ్యాసకర్త: పెంటపాటి పుల్లారావు, రాజకీయ విశ్లేషకులు
ఈ–మెయిల్ : drppullarao@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment