
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘ప్రగతి నివేదన సభ’కు జన సమీకరణపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టి సారించారు. పాత జిల్లాల వారీగా, ఆయా జిల్లాల మంత్రులకు బాధ్యతలను ఇప్పటికే అప్పగించారు. సెప్టెంబర్ 2న జరిగే ఈ సభకు ఏయే జిల్లా నుంచి ఎంత మంది వస్తున్నారు, వారికి రవాణా ఏర్పాట్లు ఎలా, వాటికి బాధ్యులు ఎవరు వంటి క్షేత్రస్థాయి విషయాలను కూడా కేసీఆర్ అడిగి తెలుసుకుంటున్నారు. హైదరాబాద్ పరిసరాల్లోని జిల్లాల నుంచి, హైదరాబాద్‌కు రవాణాసౌకర్యాలు మెరుగ్గా ఉన్న ప్రాంతాల నుంచి ఎక్కువ మందిని సమీకరిం చాలని మంత్రులను ఆదేశించారు. బహిరంగసభ సాయంత్రానికి ఉన్నా, ప్రజలు మాత్రం మధ్యాహ్నంలోపుగానే మైదానానికి చేరుకు నేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని కొంగర కలాన్‌లో జరుగుతున్న ఈ సభకు, ఔటర్ రింగురోడ్డుకు సమీప గ్రామాల వారంతా సభా ప్రాంతానికి మధ్యాహ్నంలోగానే చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. మిగిలిన దూర ప్రాంత జిల్లాల నుంచి 3 గంటల లోపుగానే మైదానానికి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రులను, బాధ్యులను కేసీఆర్ ఆదేశించారు.
జిల్లాల్లోనే మంత్రులు..
ఉమ్మడి జిల్లాకు ఇన్‌చార్జి మంత్రులు మొత్తంగా జిల్లా నుంచి జన సమీకరణ బాధ్యతలను నెత్తికెత్తుకున్నారు. వారు జిల్లాల్లోనే విస్తృతంగా పర్యటిస్తూ జన సమీకరణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రవాణా ఏర్పాట్లలో ఇబ్బందులు రాకుండా ఆర్టీసీ, ఆర్టీఏ అధికారులతో మాట్లాడుతున్నారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు లేదా పార్టీ ఇన్‌చార్జీలతో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఏయే నియోజకవర్గం నుంచి ఎంతమంది ఈ సభకు వచ్చే అవకాశం ఉంది, వారిని తరలించడానికి చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయనేదానిపై ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యే లేదా ఇన్‌చార్జి నుంచి నివేదికలను తీసుకుంటున్నారు. మంత్రులంతా ఏర్పాట్ల పర్యవేక్షణలో ఉంటూ ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే పరిష్కరిస్తూ, తాము తీసుకుంటున్న చర్యలను కేసీఆర్‌కు నివేదిస్తున్నారు.
గ్రామాలవారీగా బాధ్యులు
జన సమీకరణకు గ్రామాల వారీగా బాధ్యులను ఏర్పాటుచేసి, లక్ష్యాలను నిర్దేశించారు. రవాణాసౌకర్యాలు, భోజనాలు, ఇతర అవసరాలను స్థానిక ఎమ్మెల్యేలు ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌చార్జీలు ఈ బాధ్యతలను చూస్తున్నారు. ఒక్కో గ్రామానికి ఒకరు లేదా ఇద్దరు మండలస్థాయి నేతలకు జన సమీకరణ బాధ్యతలను అప్పగించారు. గ్రామం నుంచి సభకు వ్యక్తులను తరలించడం నుంచి, వారు తిరిగి గ్రామానికి చేరే వరకు ఆ గ్రామ నాయకులతోపాటు, ఇన్‌చార్జిగా బాధ్యతలను తీసుకున్న నేత చూసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment