సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం రోజురోజుకూ మెరుగుపడుతోంది. ఆయన వీల్‌చైర్‌లో కూర్చున్న సమాచారం డీఎంకే వర్గాల్లో మరింత ఆనందాన్ని రేకెత్తించింది. తమ అధినేత సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తమ ముందుకు వచ్చి తీరుతారని కరుణ సేనల్లో ధీమా నెలకొంది. ఇక, కేరళ సీఎం పినరాయ్ విజయన్ గురువారం కరుణను పరామర్శించేందుకు చెన్నైకు వచ్చారు.
వయోభారం, అనారోగ్యం, ఇన్‌ఫెక‌్షన్ సమస్యతో కరుణానిధి ఆళ్వార్ పేటలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు వైద్యులు ఇచ్చిన చికిత్సలు ఫలితాన్ని ఇస్తున్నాయి. పరిస్థితి ఆందోళనకరం అన్న సమాచారంతో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొన్నా, తదుపరి వైద్య చికిత్సలతో కరుణానిధి క్రమంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం రోజురోజుకూ మెరుగు పడుతోంది. దీంతో డీఎంకే వర్గాలు ఆనందం వ్యక్తంచేస్తున్నాయి. గురువారం కరుణానిధిని వైద్యులు వీల్ చైర్‌లో కూర్చొబెట్టిన సమాచారం డీఎంకే వర్గాలకు మరో శుభవార్తగా మారింది. దీంతో తమ అధినేత సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మళ్లీ తమ ముందుకు వచ్చి తీరుతారన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అలాగే, ఆస్పత్రి వద్దకు ఏడోరోజు చేరుకున్న డీఎంకే వర్గాలు కరుణ వర్థిల్లాలన‍్న నినాదాల్ని హోరెత్తించారు. ఆస్పత్రి వద్ద పూజలు చేశారు. మైనారిటీ సోదరులు ప్రత్యేక పాత్యహా నిర్వహించారు. కరుణ ఆరోగ్యం వంతుడిగా అందరి ముందుకు రావాలని ప్రార్థించారు.
లండన్ వైద్యుడి రాక
కరుణానిధిని లండన్‌కు చెందిన ఇన్ఫెక‌్షన్, అంటువ్యాధుల నివారణ నిపుణులు ఒకరు పరిశీలించారు. డీఎంకే నేత, కేంద్ర మాజీ మంత్రి జగద్రక్షకన్ లండన్ వైద్యుడిని కావేరి ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ కరుణానిధికి అందిస్తున్న వైద్య చికిత్సల్ని ఆయన పరిశీలించారు. వైద్యులతో మాట్లాడారు. ప్రస్తుతం కరుణానిధికి అందిస్తున్న వైద్య చికిత్సలు సంతృప్తికరంగా ఉన్నట్టు ఆ వైద్యుడు పేర్కొన్నారు. వయోభారం, ఆరోగ్య సమస్యలకు తగ్గట్టుగానే చికిత్సలు ఉన్నాయని, దీనిని కొనసాగించడం ద్వారా ఆరోగ్యం మరింత మెరుగు పడుతుందని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ దృష్టికి ఆ వైద్యుడు తీసుకొచ్చారు.
ఈ పోరాటంలోనూ గెలుపు తథ్యం
కరుణానిధిని పరామర్శించేందుకు కేరళ సీఎం పినరాయ్ విజయన్, సీపీఎం నేత జి.రామకృష్ణన్ ఆస్పత్రి వద్దకు ఉదయం వచ్చారు. స్టాలిన్, కనిమొళిలతో విజయన్ భేటీ అయ్యారు. కరుణ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పినరాయ్ విజయన్ మీడియాతో మాట్లాడారు. కరుణానిధి తన జీవితకాలంలో ఎన్నో పోరాటాల్ని ఎదుర్కొన్నారని, వాటన్నింటిలో విజయకేతనం ఎగురవేశారన్నారు. ప్రస్తుతం ఈ పోరాటంలోనూ ఆయన తప్పకుండా గెలిచి తీరుతారని, ప్రజల ముందుకు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా వచ్చి తీరుతారని ధీమా వ్యక్తంచేశారు. ఇక, కరుణానిధిని పరామర్శించేందుకు మహాత్మా గాంధీ మనవడు గోపాలకృష్ణన్ గాంధి, సినీ నటుడు శివకార్తికేయన్, ముత్తు కాలై, కింగ్ కాంగ్, బొండ వాసు తదితరులు ఆస్పత్రి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment