సాక్షి, చెన్నై: డీఎంకే చీఫ్, తమిళ రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి(94) ఆరోగ్య పరిస్థితి ఆదివారం రాత్రి విషమంగా మారింది. పల్స్, బీపీ, శరీర ఉష్ణోగ్రత పడిపోవడంతో (ట్రాన్సియెంట్ సెట్‌బ్యాక్) వైద్యులు తక్షణమే చికిత్సనందించారు. కాసేపటికే మళ్లీ కరుణ మామూలు పరిస్థితికి వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకోవడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆందోళన పెరిగింది. భారీ సంఖ్యలో కార్యకర్తలు ఆళ్వార్‌పేటలోని కావేరీ ఆసుపత్రికి చేరుకోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సీఎం పళనిస్వామి, డీఎంకే సహా వివిధపార్టీల ముఖ్యనేతలు ఆసుపత్రి చేరుకుని కరుణ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. రాత్రి 10 గంటల సమయంలో ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఆయన కోలుకుంటున్నారని.. అయితే నిరంతర వైద్య పర్యవేక్షణలోనే ఉన్నారని తెలిసింది.
ఆసుపత్రి వద్ద హైడ్రామా..
ఆదివారం మధ్యాహ్నం కరుణ ఆసుపత్రిలో ఉన్న ఫొటో విడుదలతో ఆయన బాగానే ఉన్నారని కార్యకర్తలు భావించారు. అయితే ఉన్నట్లుండి రాత్రి 9 గంటల సమయంలో ఆరోగ్యం విషమించినట్లు వార్తలు రావడంతో కలకలం రేగింది. చెన్నై ఆళ్వార్‌పేటలోని కావేరీ ఆసుపత్రికి వీవీఐపీల తాకిడి పెరగడంతో అభిమానుల్లో కలవరం మొదలై భారీ సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు. కరుణ ఆరోగ్యం బాగానే ఉందని.. కార్యకర్తలంతా ఇళ్లకు వెళ్లాలని డీఎంకే నేత రాజా కోరారు. వీరిని బయటకు పంపేందుకు పోలీసులు ప్రయత్నించగా.. కార్యకర్తలు నిరాకరించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ వచ్చి సమాచారం ఇస్తేనే నమ్ముతామని డిమాండ్ చేస్తూ మొండికేసి కూర్చున్నారు. వీరిని కట్టడి చేయడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. దీంతో కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఇది స్వల్ప లాఠీచార్జ్‌కు దారితీసింది. చివరకు రాత్రి 11 గంటల సమయంలో స్టాలిన్, అళగిరితో పాటు ఇతర కుటుంబ సభ్యులు, డీఎంకే ముఖ్య నాయకులు ఇళ్లకు వెళ్లడంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత సద్దుమణిగింది. పార్టీ శ్రేణులు అక్కడి నుంచి కదిలాయి. కాగా, తాజా పరిస్థితులతో చెన్నైలో హై అలర్ట్ ప్రకటించారు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అటు, డీఎంకే కార్యాలయం వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.
పరామర్శించిన వెంకయ్య తదితరులు
ఆదివారం సాయంత్రం చెన్నై చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్.. ఆసుపత్రిలో వైద్యులు, కుటుంబ సభ్యులను అడిగి కరుణానిధి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో కరుణానిధి కుటుంబ సభ్యులంతా హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ వార్తలతో చెన్నై సహా తమిళ రాజకీయాల్లో కలకలం రేగింది. భారీ సంఖ్యలో డీఎంకే కార్యకర్తలు కావేరీ ఆసుపత్రి వద్దకు చేరుకుని కరుణానిధి ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థనలు చేస్తున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. డీఎంకే ముఖ్యనేతలంతా అందుబాటులో ఉండాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు, సేలం పర్యటనలో ఉన్న తమిళనాడు సీఎం ఈ పళనిస్వామి.. తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని చెన్నై పయనమయ్యారు. రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఆయన ఆసుపత్రిలో కరుణ కుటుంబసభ్యులను పరామర్శించారు. అటు, మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ముఖ్యనేత పి. చిదంబరం కూడా హుటాహుటిన కావేరీ ఆసుపత్రికి చేరుకున్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, తృణమూల్ నేత డెరిక్ ఓబ్రెయిన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందర రాజన్, ఎండీఎంకే నేత వైగో తదితరులు కరుణ కుటుంబసభ్యులను పరామర్శించారు. ‘ఆసుపత్రిలో మాజీ తమిళనాడు సీఎం కరుణానిధిని కలిశాను. ఆయన కుటుంబసభ్యులను, డాక్టర్లను అడిగి కరుణ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నాను. ఆయన ప్రస్తుతం బాగానే ఉన్నారని వైద్యులు చెప్పారు. ఆయ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని వెంకయ్య ట్వీట్ చేశారు.
హెల్త్ బులెటిన్‌లో ఓకే!
కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన నెలకొన్న పరిస్థితిలో ఆదివారం సాయంత్రం ఆయన ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఓ చిత్రాన్ని విడుదల చేశారు. ఇందులో కరుణ వెంటిలేటర్‌పై లేకపోవడం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారనే సంకేతాలివ్వడంతో అభిమానులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే సాయంత్రం నుంచి ఆసుపత్రికి వీఐపీల తాకిడి పెరగడంతో మళ్లీ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. దీంతో వీరంతా భారీ సంఖ్యలో ఆసుపత్రికి తరలివచ్చారు. ఈ నేపథ్యంలో రాత్రి 10 గంటల ప్రాంతంలో కావేరీ ఆసుపత్రి వైద్యులు హెల్త్‌బులెటిన్ విడుదల చేశారు. కరుణను వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని.. పల్స్, బీపీ, టెంపరేచర్ వంటివి కొద్దిసేపు తగ్గినట్లు అనిపించినా.. వెంటనే సాధారణ స్థితికి వచ్చాయని అందులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కరుణానిధి ఆస్పత్రిలో ఉన్న సమాచారం తట్టుకోలేక మరో ఇద్దరు డీఎంకే కార్యకర్తల గుండెలు ఆగాయి. చెన్నై ఎన్నూర్ అన్నై శివగామినగర్‌కు చెందిన డీఎంకే కార్యకర్త రాజు(60) మనో వేదనతో ఇంట్లో ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Published Mon, Jul 30 2018 3:12 AM | Last Updated on Mon, Jul 30 2018 7:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment