
మాట్లాడుతున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి
తాడిపత్రి: ‘అభివృద్ధి అంటే బస్టాపుల్లో బార్లు తెరవడమా, గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహించడమా... ఇదేనా..జేసీ..నీవు చేస్తున్న అభివృద్ధి..అసలు నీకు సిగ్గు, శరం ఉన్నాయా’ అని తాడిపత్రి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ సోదరులపై నిప్పులు చెరిగారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాడిపత్రి ప్రాంతం అభివృద్ధి చెందిందంటే అది కేవలం వైఎస్సార్ హయాంలోనేనని, జేసీ సోదరులు చేసింది ఏమీలేదన్నారు. ప్రజాసమస్యలపై నిరసన తెలిపే హక్కు సమాజంలో ప్రతి పౌరుని ఉందని, దాన్ని పోలీసుల ద్వారా అడ్డుకోవడం చూస్తే జేసీ సోదరుల అధికార దర్పానికి నిదర్శనమన్నారు. ఈ రోజు నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు రాజ్యమేలుతున్నాయని, జేసీ సోదరులను చూపి భయపడి ప్రజలు సమస్యలపై నిలదీయలేకపోతున్నారన్నారు. ఇక నుంచి సమస్యలపై నిలదీసే వారందరికీ వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని పెద్దారెడ్డి హామీ ఇచ్చారు.
జేసీ సోదరులు లారీ అసోషియేషన్ ముసుగులో కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. అల్ట్రాటెక్, గెర్డావ్ పరిశ్రమల్లో లారీ యజమానులకు లోడింగ్‌కు అవకాశం లేకుండా తన సొంత లారీలలోనే ముందుగా లోడింగ్ చేయాలని పరిశ్రమల యాజమాన్యాలను కూడా బ్లాక్‌మెయిల్ చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. నిత్యం ఇతరులకు నీతులు చెప్పే జేసీ సోదరులు... వారు మాత్రం నీతిమాలిన పనులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. గ్రామాల్లో ఫ్యాక్షన్‌ను పెంచి పోషించింది జేసీ సోదరులేనని, తన సోదరున్ని పోగొట్టుకున్నా తాను ఎంతో ఓర్పుతో ఉన్నానని పెద్దారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజల్లో చైతన్యం వస్తోందని, జేసీ సోదరులకు ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. సమావేశంలో పెద్దవడుగూరు, యాడికి జెడ్పీటీసీ సభ్యులు చిదంబరరెడ్డి, వెంకట్రామిరెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గయాజ్, రఘునాథ్‌రెడ్డి, రంగనాథ్‌రెడ్డి, సంపత్, బాలరాజు, నాగభూషణం పాల్గొన్నారు.