
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నకిరేకల్ టికెట్ ఆశిస్తున్న చిరుమర్తి లింగయ్యకు మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్దతుగా నిలిచారు. ‘లింగయ్యకు నకిరేకల్ టికెట్ తప్పక వస్తుంది. అలా జరగని పక్షంలో నేను మునుగోడు నుంచి పోటీచేసే ప్రసక్తే లేదు. నా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నల్లగొండ నుంచి పోటీ చేయడు’ అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇంటిపార్టీకి ఒక సీటు కేటాయిస్తామని కుంతియా చేసిన ప్రకటనతో ఈ అయోమయం నెలకొందని అన్నారు.
‘గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులకే కాంగ్రెస్ టికెట్లు ఇస్తుందని నమ్ముతున్నాను. భక్త చరణ్‌దాస్ నిజాయితీపరుడు. ఆయన టికెట్లు అమ్ముకుంటున్నారనే ఆరోపణల్లో నిజం లేదు. తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్, ఓయూ జేఏసీ నేత మానవత రాయ్‌కు టికెట్లు ఇవ్వనున్నారు’ అని రాజగోపాల్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. టికెట్ల ఎంపిక ప్రక్రియ చాలా బాగా జరిగిందని అన్నారు. టికెట్ దక్కని వారికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని అన్నారు. పాల్వాయి స్రవంతికి నా సహకారం ఎప్పుడూ ఉంటుందనీ, ఆమె రాజకీయ భవిష్యత్తుకు అండగా ఉంటానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment