
తెనాలి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కె.చంద్రశేఖర్‌రావు ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని వల్లభాపురం సమీపంలో కృష్ణానది ఒడ్డున ఆదివారం కొండా వారి కార్తీక వన సమారాధనను ఘనంగా నిర్వహించారు.
దీనికి ముఖ్యఅతిథిగా కొండా రాఘవరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రచార ఆర్భాటాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులనే చంద్రబాబు, కేసీఆర్ మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని కొండా రాఘవరెడ్డి ధ్వజమెత్తారు. ఆయా ప్రాజెక్టులకు అరకొర నిధులు కేటాయిస్తున్నారని విమర్శించారు.