
సాక్షి, విజయనగరం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. చిత్తూరు జిల్లా తాంబల్లపల్లి నియోజకవర్గం పీటీఎం మండలం ఎంపీపీగా ఉన్న కొండా గీతమ్మ, కొండా సిద్ధార్థ్ తమ అనుచరులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలో ఉన్న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మాజీ ఎంపీ మిథున్ రెడ్డి, ద్వారాకానాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వారు కలిశారు. టీడీపీలో 40 ఏళ్ల పాటు కొనసాగిన కొండా సిద్ధార్థ్ కుటుంబాన్ని జననేత సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనపై టీడీపీ నేతలకే నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. ఎంతోకాలం టీడీపీలో కొనసాగిన కొండా సిద్ధార్థ్ కుటుంబం ఆ పార్టీని వీడిందంటే చంద్రబాబు ఎంత ఘోరంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోందన్నారు.
తనపై హత్యాయత్నం జరిగినా వైఎస్ జగన్ చాలా హుందాగా వ్యవహరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబులా పబ్లిసిటీ కోసం పాకులాడకుండా.. ప్రజలు సంయమనం పాటించేలా వైఎస్ జగన్ చేశారని తెలిపారు. టీడీపీ చేస్తున్న మోసాలు వెలుగులోకి రావడంతో ఆ పార్టీ నేతలు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారన్నారు. కొండా సిద్ధార్థ్ మాట్లాడుతూ.. టీడీపీ వ్యవస్థాకుడు ఎన్టీఆర్ పాటించిన విలువలు ప్రస్తుతం టీడీపీలో లేవని అన్నారు. అందుకే 40 ఏళ్లు టీడీపీలో ఉన్నప్పటికీ.. విలువల కోసమే ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు వెల్లడించారు. టీడీపీ నిజమైన నేతలకు, కార్యకర్తలకు ప్రస్తుతం విలువ లేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment