సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కొత్తపల్లి గీత... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2014 ఎన్నికల్లో అరకు ఎంపీగా గెలుపొంది మూడునెలలు తిరక్కుండానే టీడీపీలోకి ఫిరాయించిన నేతగా అపకీర్తి పొందారు. గడచిన మూడున్నరేళ్లుగా టీడీపీతోనే అంటకాగిన ఆమె ఇటీవలికాలంలో తన స్వరాన్ని మారుస్తూ వస్తున్నారు. రెండు వారాల కిందట రాష్ట్ర ప్రభుత్వం అరకులో అట్టహాసంగా నిర్వహించిన బెలూన్ ఫెస్టివల్‌కి స్థానిక ఎంపీగా తనకు కనీసంగా ఆహ్వానం అందలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక బిల్‌గేట్స్‌ను పిలిపించి విశాఖపట్నంలో ఇటీవల భారీఎత్తున నిర్వహించిన అగ్రిహాక్‌థాన్ సదస్సుకు సైతం తనకు సమాచారమివ్వలేదని సోషల్ మీడియాలో వాపోయారు. ఆమె అలకలను, అసంతృప్తులను అధికార పార్టీలో ఏ ఒక్కరూ పట్టించుకోలేదు.
కనీసం ఆమెను ఎంపీగా కూడా టీడీపీ నేతలు గుర్తిం చడం లేదు. రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతం నుంచి గెలిచిన ఏకైక ఎంపీగా హోదా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కనీసమాత్రం పట్టించుకోవడం లేదు. ఎంపీని చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, నమ్మి ఓట్లేసిన ప్రజలకు ద్రోహం చేశారన్న అపఖ్యాతి ఎదుర్కొంటూ కూడా.. టీడీపీ నేతల నుంచి కనీస గౌరవాన్ని పొందలేకపోయారు. ఆ నిస్పృహతోనే ఇటీవలికాలంలో తరచుగా ఆమె చంద్రబాబుపై, తెలుగుదేశం పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆదివారం విశాఖలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్(ఏపీడబ్లుజేఎఫ్) నిర్వహించిన వనసమారాధనలో అతిధిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ టీడీపీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
సందర్భం కాకపోయినా..
సమయం, సందర్భం, వేదిక కాకపోయినా.. తనంతట తానుగానే టీడీపీతో ఏమాత్రం సంబంధం లేదని కొత్తపల్లి గీత చెప్పుకొచ్చారు. అందరూ తనను టీడీపీలో చేరిన నేతగా చూస్తున్నారని, అయితే తాను ఎప్పుడూ తెలుగుదేశం పార్టీలో చేరలేదని, భవిష్యత్తులో కూడా చేరబోనని స్పష్టం చేశారు. తాను వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీకి దూరంగా మాత్రమే ఉన్నానని చెప్పుకొచ్చారు. తాను టీడీపీలో లేనన్న విషయాన్ని దయచేసి ప్రజలు, మీడియా గమనించాలని ఆమె వేడుకున్నారు. కాగా, సందర్భం లేకపోయినా కొత్తపల్లి గీత చేసిన రాజకీయ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కన్నతల్లి లాంటి వైఎస్సార్‌సీపీని స్వార్ధంతో వీడి టీడీపీ పంచన చేరినప్పటికీ... అక్కడ అవమానభారాలతో ఇమడలేక దూరమై... మొత్తంగా కొత్తపల్లి గీత పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారిపోయిందన్న వ్యాఖ్యలు బహిరంగంగానే వినిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment