సాక్షి, కామారెడ్డి/సిరిసిల్ల: మహాకూటమికి ఓటేస్తే మరణ శాసనం రాసుకున్నట్లేనని మంత్రి కె.తారకరామారావు వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఎల్లారెడ్డి నియోజకవర్గ టీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో.. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో జరిగిన సభలో ఆయన ‘ఇప్పుడు జరిగే ఎన్నికలు ఏ ఒక్కరికీ సంబంధించినవి కావు.. తెలంగాణ రైతుల తలరాత మార్చే ఎన్నికలు.. అందుకే మాయమాటలకు మోసపోయి పొరపాటున మహాకూటమికి ఓటేస్తే మనకు మనం మరణశాసనం రాసుకున్నట్లేనని చెప్పారు. ఓటు వేసేటప్పుడు ఒకసారి ఆలోచించాలని ఆయన కోరారు. రాహుల్‌గాంధీ, నరేంద్రమోదీ, చంద్రబాబునాయుడులకు తాము భయపడే వాళ్లం కాదన్నారు.
ఉనికి కోసమే కేసులు
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రజల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వస్తున్న మంచి ఆదరణను చూసి జీర్ణించుకోలేని కాంగ్రెస్ నేతలు.. ఎక్కడ తమ ఉనికి పోతుందోనన్న భయంతో కోర్టుల్లో కేసులు వేస్తూ కాళ్లకు అడ్డం పెడుతున్నారని మండిపడ్డారు. కోటి ఎకరాలకు సాగు నీరందించేందుకు ప్రాజెక్టులు నిర్మిస్తుంటే.. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద 200 కేసులు వేశారని, పనులు జరగకుండా ఆటంకాలు కల్పించామని ప్రతిపక్ష నేతలు జబ్బలు చరుచుకుంటున్నారని విమర్శించారు. కోటీ 20 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తే తమ కిందకు నీళ్లొస్తాయనే భయంతో కాంగ్రెస్ నేతలు.. చనిపోయిన వారి పేర్లతో కోర్టుల్లో కేసులు వేయించారని, ఇదే విషయాన్ని నీటిపారుదలశాఖ మంత్రి అసెంబ్లీలో రుజువు చేశారని గుర్తు చేశారు.
రాహుల్‌వన్నీ అబద్ధాలే..
కామారెడ్డి సభలో రాహుల్‌గాంధీ చెప్పినవన్నీ అబద్ధాలేనని కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80 వేల కోట్లు అయితే లక్ష కోట్లు అని రాహుల్ పేర్కొన్నారని విమర్శించారు. రీ డిజైన్ కారణంగా 16 లక్షల ఎకరాల ఆయకట్టు 36 లక్షల ఎకరాలకు పెరిగిందని, అందువల్లే రూ.40 వేల కోట్ల నుంచి రూ.80 వేల కోట్లకు అంచనాలు పెరిగాయని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏర్పడబోయే కేంద్ర ప్రభుత్వంలో మనం కీలక పాత్ర పోషించబోతున్నామని, అప్పుడు కేంద్రంతో ముడిపడి ఉన్న రాష్ట్ర ప్రయోజనాలన్నీ నెరవేర్చుకోవచ్చన్నారు. కేసీఆర్ వైద్యం కోసం ఢిల్లీకి వెళ్తే ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లాడని కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. పోలింగ్ శాతం పెంచడం ద్వారా మెజారిటీ పెరుగుతుందని ప్రతి కార్యకర్త ఓటర్లందరితో ఓట్లు వేయించే ప్రయత్నం చేయాలని కోరారు. సభలో తాజా మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎంపీ బీబీపాటిల్, జెడ్పీ చైర్మన్ రాజు పాల్గొన్నారు.
వారికి తగ్గట్టే గుర్తులు
ఎన్నికల కమిషన్ పార్టీల తీరుకు తగ్గట్టుగానే గుర్తులను కేటాయించిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పుల్లలు పెట్టేటోళ్లకు అగ్గిపుల్ల గుర్తు (టీజేఎస్) కేటాయించిందని, మొండిచేయి చూపించేటోళ్లకు చేయి గుర్తు ( కాంగ్రెస్), చెవుల్లో పువ్వులు పెట్టేటోళ్లకు పువ్వు గుర్తు (బీజేపీ), స్పీడ్‌తో దూసుకుపోతున్న వారికి కారు గుర్తు (టీఆర్‌ఎస్) కేటాయించిందని ఆయన చమత్కరించారు.
పొత్తు ఎందుకో చెప్పాలి?
2004లో తాము కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి కారణం ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తామన్న దానికేనని కేటీఆర్ వివరిం చారు. 2009లో తెలంగాణకు అనుకూలంగా టీడీపీ తీర్మానం చేసినందుకే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని, ఇప్పుడు టీజేఎస్, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పార్టీలు ఎందుకు పొత్తు పెట్టుకున్నాయో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుతో ఏ ప్రాతిపాదికన పొత్తులు పెట్టు కుంటున్నారో కోదండరాం ప్రకటించాలన్నారు.
ఎత్తుగడలను తిప్పి కొట్టేందుకే ‘ముందస్తుకు’..
కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కావేరి జల వివాదాల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటై పోరాడుతాయని, కానీ మన రాష్ట్రంలో ప్రభుత్వం రైతులకు నీళ్లిస్తే అడ్డు తగులుతున్నాయని కేటీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలు కేసులతో అడ్డుకోవడం వల్లనే కాళేశ్వరం పనులు పూర్తి కాలేదని పేర్కొన్నారు. రైతుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నంలో భాగంగానే కేసులని, వాళ్ల ఎత్తుగడలను తిప్పికొట్టేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ 9 నెలల ముందు ఎన్నికలకు వెళ్లారన్నారు.
వాళ్ల చేతికి జుట్టు అప్పగిస్తే రైతుల నోట్లో మట్టి
తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుకున్న గడ్డపోళ్లు ఇప్పుడు ఒక్కటైతున్నారని, వాళ్ల చేతికి జుట్టు అప్పగిస్తే రైతుల నోట్లో మట్టి కొట్టినట్లేనని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రపంచ చరిత్రలో రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చింది సీఎం కేసీఆరేనని చెప్పారు. కేసీఆర్‌ను కాపాడుకుంటేనే పేదలకు మేలు జరుగుతుందన్నారు. తప్పుదారిన కూటమి అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అవుతారో కూడా తెలియదని, నెలన్నరకు ఒకరిని చొప్పున మార్చాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment