పార్టీ నేతల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
సాక్షి,సిటీబ్యూరో: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గ్రేటర్‌పై గులాబీ జెండా ఎగురవేసేందుకు పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే శ్రమించాలని మున్సిపల్ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో మన పరిస్థితి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రస్తుత పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు సెప్టెంబర్ 2వ తేదీన కొంగరకలాన్‌లో నిర్వహించనున్న ‘ప్రగతి నివేదన’ బహిరంగ సభకు గ్రేటర్‌లోని ప్రతి నియోజకవర్గం నుంచి 30 వేల మందిని తరలించాలని సూచించారు. శుక్రవారం జలవిహార్‌లో నగర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్పొరేటర్ల, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో హైదరాబాద్ జిల్లా టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాల అమలుతో అభివృద్ధిలో దూసుకెళుతున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాలుగున్నరేళ్లలో రూ.65 వేల కోట్ల ఖర్చుతో సుమారు 400 అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి సాక్షాత్తు ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల మంత్రులు ప్రశంసిస్తున్నారన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో 100 కార్పొరేటర్ సీట్లు గెలుస్తామని ప్రకటిస్తే పలు పార్టీల నాయకులు విమర్శించారని, గెలుపుతో వారికి బుద్ధి చెప్పామన్నారు.
రాహుల్ వ్యాఖ్యలు అవివేకం..
ఇటీవల రెండు రోజుల హైదరాబాద్ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతుందని పేర్కొనడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందని టీడీపీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారన్నారు. కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రమంత్రులు అభినందిస్తుంటే స్థానిక బీజేపీ నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
రూ.50 వేల కోట్లతో అభివృద్ధి పనులు
జంటనగరాలకు మరిన్ని మంచిరోజులు రానున్నాయని, రూ.50 వేల కోట్లతో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటి అభివృద్ధి పనులను చేపడతామన్నారు. సెప్టెంబర్ రెండోవారంలో ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గంలో మెట్రోరైళ్లను ముఖ్యమంత్రి ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలే తిరిగి టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకొస్తాయని, వచ్చే ఎన్నికలలో 100 సీట్లు తప్పక గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావుగౌడ్, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, వివేకానంద్, సాయన్న, మేయర్ బొంతు రాంమోహన్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, స్టీవెన్సన్, నియోజకవర్గ ఇంఛార్జులు, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వరద బాధితులకు సహాయంగా..
ఇటీవల కేరళలో కురిసిన భారీవర్షాలు, వరదలతో కష్టాలలో ఉన్న ప్రజలకు చేయూతగా పలువురు చెక్కులను మంత్రి కేటీఆర్‌కు అందించారు. సికింద్రాబాద్ కు చెందిన తెలంగాణ వీరభద్రీయ సంఘం ఆధ్వర్యంలో రూ.50 వేలు, అంబర్ పేట భాష్యం పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు రూ.లక్ష చెక్కును అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment