మండ్య: అంబరీశ్ మరణించిన బాధ తాలూకు ఛాయలే సుమలతలో కనిపించడం లేదని సీఎం హెచ్‌డీ కుమారస్వామి విమర్శించారు. మండ్య నగరంలోని బందిగౌడ లేఔట్‌లో ఉంటున్న మాజీ ఎంపీ జి.మాదేగౌడతో సీఎం బుధవారం భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుమలతా ప్రసంగాలను గమనిస్తున్నానని, ఆమె ముఖంలో భర్త చనిపోయిన బాధ ఏమాత్రం లేదని విమర్శించారు. నాటకీయంగా సినిమా డైలాగ్‌లు చెబుతూ ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
మండ్య జిల్లాలో సుమారు 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కష్టాలపై తాను స్పందిస్తానని తెలిపారు. రైతు కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం కోసం సాయం చేస్తానన్నారు. సుమలతా ఆటలు ఎక్కువ కాలం సాగవని విమర్శించారు. మైసూరులోని ఏ హోటల్‌లో కుర్చొని డబ్బులు ఇచ్చి పుచ్చుకున్నారు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తనకు అన్ని విషయాలు తెలుసునని తెలిపారు. మండ్యలో సీఎం తనయుడు నిఖిల్ జేడీఎస్ అభ్యర్థిగా, సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.
బీఎస్‌ఎఫ్ భద్రత తెచ్చుకోండి
సుమలతకు ప్రత్యేక భద్రత కావాలంటే బీఎస్‌ఎఫ్ లేదా సరిహద్దులో గస్తీ కాసే వారిని భద్రతకు పెట్టుకోవచ్చని, అవసరమైతే తానే కేంద్రానికి లేఖ రాస్తానని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ఎవరి ఫోన్లను ట్యాప్ చేయట్లేదని తెలిపారు. కావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక దర్యాప్తు చేసుకోవచ్చని తెలిపారు. తాను ఎవరిని జోడెద్దులు, దొం గ ఎద్దులు అని సంభోధించలేదన్నారు. దొంగ ఎద్దులు అని మాట్లాడినట్లు వచ్చినవన్నీ మీడియా సృష్టేనన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం కొన్ని ఎద్దులు వస్తాయని మాత్రమే తాను వ్యాఖ్యానించినట్లు తెలిపారు. ఎవరికి ఓట్లు వేయాలనే విషయం ప్రజలకు తెలుసునని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment