సాక్షి, బళ్లారి/ బెంగళూరు: రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ, జేడీ(ఎస్) కుమ్మక్కయ్యాయని సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి ఢిల్లీ విమానాశ్రయంలో ప్రత్యేకంగా కలుసుకుని మంతనాలు జరిపారని తెలిపారు. ఆ ఫొటోలు తన వద్ద ఉన్నాయని అవసరమైతే వాటిని బయటపెడతానని హెచ్చరించారు.
ఆదివారం బెళగావిలో జరిగిన ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వారిద్దరూ ఒకే విమానంలో వెళ్లారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కుమ్మక్కై ప్రచారం చేస్తున్నాయి అనేందుకు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి’ అని అన్నారు. హంగ్ ఏర్పడితే జేడీఎస్ కింగ్‌మేకర్ అవుతుందని పలు సర్వేలు చెబుతున్న నేపథ్యంలో సీఎం వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వీటిని బీజేపీ, జేడీఎస్ కొట్టిపారేశాయి.
సిద్దరామయ్య పిచ్చోడు: యడ్యూరప్ప
సిద్దరామయ్యపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సీఎం అభ్యర్థి యడ్యూరప్ప తీవ్ర విమర్శలు చేశారు. ‘వాడొక పిచ్చోడంటూ’ మండిపడ్డారు . చాముండేశ్వరిలో గెలవడం అసాధ్యమని తెలిసిపోవడంతోనే సిద్దరామయ్య బాదామిలోనూ పోటీ చేస్తున్నారన్నారు.
కింగ్ మేకర్ కాదు కింగ్‌నే: కుమారస్వామి
కర్ణాటక ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తే కింగ్ మేకర్‌ను కాకుండా కింగ్‌నే అవుతానని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమార స్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పార్టీ రాజకీయ ఉనికికి ఈ ఎన్నికలు కీలకమైనవని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ రాదని, ఈసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడనుందని అందులో జేడీఎస్ పార్టీ కింగ్ మేకర్ పాత్రను పోషించనున్నట్లు ఇటీవల సర్వేల్లో వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుమారస్వామి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తాము 113 సీట్లను లక్ష్యంగా చేసుకున్నామని అందుకు తగ్గట్లుగానే కీలకమైన వ్యూహాలతో అభ్యర్థులను నిలబెట్టామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment