ప్రగతిభవన్ వైపు ర్యాలీగా వెళ్తున్న కోమటిరెడ్డిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు , కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : అధికార బీజేపీ, టీఆర్‌ఎస్‌లపై కాంగ్రెస్ నేతలు మాటలదాడి చేశారు. ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయని మండిపడ్డారు. శుష్క వాగ్దానాలు, కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశ ప్రజలను మోసం చేసిందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా ఆరోపించారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ, ప్రజావ్యతిరేక పోకడలకు నిరసనగా సోమవారం గాంధీభవన్‌లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘భారత్ బచావో ఆందోళన్’సభ జరిగింది. అంతకుముందు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన కుంతియా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కాషాయ కూటమి ఓటమి పాలు కావడం ఖాయమని, రాహుల్‌గాంధీ సారథ్యంలోని లౌకిక ప్రజాస్వామ్య కూటమి అధికారంలోకి వస్తుందన్నారు.
వచ్చే ఎన్నికల్లో యువతకు ప్రోత్సాహమివ్వాలని రాహుల్ ఆలోచిస్తున్నారని, ప్రజల్లో ఉన్న యువ నేతలకు ఈసారి ఖచ్చితంగా అవకాశం లభిస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యువత ఎన్నో త్యాగాలు చేసిందని, ఆయితే ఈ త్యాగాల కారణంగా కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడిందని అన్నారు. టీఆర్‌ఎస్ కేబినెట్‌లో దళితులకు, మహిళలకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చిన కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని త్యాగం చేసేందుకు సోనియాగాంధీ వెనుకాడలేదని, అలాంటి వ్యక్తిని ఉద్దేశించి రాష్ట్ర మంత్రి కేటీఆర్ సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. కేటీఆర్ వెంటనే ఆ మాటలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో 10 సీట్లు కేటాయించాలి
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. భారత్ బచావో సభకు హాజరైన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో యువతకు 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని, 65ఏళ్లు పైబడిన వారికి పార్టీ బాధ్యతలు అప్పజెప్పాలని అధిష్టానానికి సూచించారు. యువత అధైర్యపడవద్దని, కోమటిరెడ్డి బ్రదర్స్ వారికి అండగా ఉంటారని చెప్పారు. యూత్ కాంగ్రెస్‌తో పాటు ఇతర యువజన సంఘాలపై తప్పుడు కేసులు పెట్టే అధికారులు, పోలీసుల పేర్లు రాసిపెట్టుకోవాలని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి తానే తేలుస్తానని వ్యాఖ్యానించారు.
మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ సోనియా తెలంగాణ ఇచ్చింది ఇక్కడి ప్రజలను చూసే కానీ, కేసీఆర్ కుటుంబాన్ని చూసి కాదని అన్నారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకుల వెంట తిరగడం మాని, నియోజకవర్గ స్థాయిలో స్వతహాగా గుర్తింపు తెచ్చుకోవాలని, అప్పుడే పార్టీలో భవిష్యత్ ఉంటుందని చెప్పారు. యువ నాయకత్వంతోనే కాంగ్రెస్ అధికారంలోకి రావడం సాధ్యమవుతుందని అన్నారు. సభలో యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు కేశవ్ చంద్ యాదవ్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్., టీపీసీసీ నేతలు గూడూరు నారాయణరెడ్డి, మల్లు రవిలతోపాటు పెద్ద ఎత్తున యూత్‌కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
చలో ‘ప్రగతి భవన్’
‘భారత్ బచావో ఆందోళన్’ సభ ముగిసిన తర్వాత నాటకీయ పరిణామం జరిగింది. సోనియా గాంధీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ‘చలో ప్రగతిభవన్’ కార్యక్రమానికి పిలుపునివ్వడం ఉద్రిక్తతకు దారితీసింది. ‘‘కేటీఆర్.. సోనియా గాంధీ తెలంగాణకు అమ్మ లాంటిది, ఆమెను అమ్మా బొమ్మా అంటావా, నీ ప్రగతి భవన్‌కు వస్తున్నాం.. దమ్ముంటే ఆపు’’ అన్న నేతల ఉపన్యాసం తో సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, యూత్ కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు కేశవ్‌చంద్ యాదవ్, అనిల్‌కుమార్ యాదవ్‌ల నేతృత్వంలో వందలాది మంది కార్యకర్తలు గాంధీభవన్ నుంచి ప్రదర్శనగా బయలుదేరారు. పోలీసులు అప్రమత్తంగా లేకపోవడంతో పెద్దఎత్తున కార్యకర్తలు రోడ్డుపైకి చేరుకున్నారు. పోలీసులు వెంటనే తేరుకుని వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా గాంధీభవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు నడుమ పెద్దఎత్తున తోపులాట జరిగింది. దీంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేయాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment