జహీరాబాద్(మెదక్): కాంగ్రెస్‌లో ఉన్నతమైన పదవులను అనుభవించిన పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ పార్టీని వీడి వెళ్లినా ఎలాంటి నష్టం లేదని ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రామచంద్ర కుంతియా అన్నారు. శుక్రవారం రాత్రి జహీరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే జె.గీతారెడ్డితో కలసి విలేకరులతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ను వీడిన వారే అన్ని విధాలుగా నష్టపోయారని ఆయన పలువురిని ఉదహరిస్తూ గుర్తు చేశారు.
డీఎస్‌కు కూడా అదే గతి పడుతుందన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో అనేక కుంభకోణాలు చోటుచేసుకున్నాయన్నారు. బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పుడు అన్నింటిని విస్మరించారని విమర్శించారు.