విలేకరులతో మాట్లాడుతున్న కన్నబాబు. చిత్రంలో దాడిశెట్టి రాజా, జక్కంపూడి రాజా తదితరులు
సాక్షి, రాజమహేంద్రవరం: జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ టీడీపీతో తెగతెంపులు చేసుకున్నా ఆ పార్టీ భావజాలం నుంచి ఇంకా బయట పడలేదన్న విషయం ఆయన వ్యాఖ్యలతో తెలుస్తోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. టీడీపీ భావజాలం నుంచి బయటపడాలని పవన్‌కల్యాణ్‌కు సూచించారు. మంగళవారం ఆయన పార్టీ నేతలతో కలసి రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘గోదావరి జిల్లాలు మర్యాద, ఆప్యాయతలకు పెట్టింది పేరు. లేని ఫ్యాక్షన్‌ను గోదాట్లో కలిపేస్తారా? చంద్రబాబు చేస్తున్న ప్రచారానికి ఊతమిచ్చేలా పవన్ కల్యాణ్ మాట్లాడడం సరికాదు’ అని కన్నబాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టిన, తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన కాంగ్రెస్‌తో పొత్తు ఎలా పెట్టుకుంటావు చంద్రబాబూ? అని పవన్ అడుగుతారని ప్రజలు ఎదురు చూశారని, కానీ అవన్నీ వదిలేసి లేని ఫ్యాక్షన్‌ను గోదాట్లో కలిపేస్తానని ఎలా అంటారని ప్రశ్నించారు.
ఆ తేడా తెలుసుకోండి...
వైఎస్ జగన్ అంటే కోపం లేదన్న వ్యాఖ్యలను స్వాగతిస్తూనే రాజకీయాల్లో అర్థరహితంగా మాట్లాడవద్దని కన్నబాబు సూచించారు. జనాన్ని నమ్ముకున్న నేత వైఎస్ జగన్ అయితే కుట్రలు, కుతంత్రాల నేత చంద్రబాబు అని స్పష్టం చేశారు. ఆ తేడా తెలుసుకుని మాట్లాడాలని పవన్ కల్యాణ్‌కు సూచించారు. వైఎస్ రాజారెడ్డి హంతకులకు వైఎస్ కుటుంబం ఎలాంటి హానీ తలపెట్టలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. హంతకులకు అప్పడు ఆశ్రయం కల్పించింది చంద్రబాబేనన్న విషయం అందరికీ తెలుసన్నారు. ఫ్యాక్షనిజం చేస్తే కడప ఎంపీ ఎన్నికల్లో వైఎస్ జగన్‌కు ఐదున్నర లక్షల మెజారిటీ వచ్చేదా? అని ప్రశ్నించారు.
పవన్.. పూచీ ఏమైంది?
‘చంద్రబాబు ఇచ్చిన 650 హామీలకు తనదే పూచీ అని గత ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రకటించారు. వాటిని అమలు చేయకపోతే ప్రశ్నిస్తానన్నారు. మరి నాలుగున్నరేళ్లుగా ఎక్కడ ప్రశ్నించారు?’ అని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా నిలదీశారు. కంటితుడుపు చర్యగా ఇప్పుడు నాలుగు విమర్శలు చేస్తే సరిపోదన్నారు. అసెంబ్లీలో అధికార పార్టీ వేధింపులను ఎదుర్కొంటూ నాలుగేళ్లకుపైగా వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై ప్రశ్నించారని చెప్పారు. పవన్ కల్యాణ్ అయితే ఒక్కరోజు కూడా అసెంబ్లీలో ఉండలేరన్నారు. వ్యవస్థలు ఫెయిలయ్యాయి కాబట్టే కవాతు నిర్వహించామని పవన్ కల్యాణ్ చెప్పడంపై స్పందిస్తూ అసెంబ్లీ వ్యవస్థ విఫలమైంది కాబట్టే ప్రతిపక్ష నేత ప్రజల్లోకి వచ్చారని చెప్పారు. వైఎస్సార్ మాదిరిగానే వైఎస్ జగన్‌ను కూడా తూర్పు గోదావరి జిల్లా ప్రజలు గుండెలకు హత్తుకుంటారని చెప్పారు.
చంద్రబాబు తాట తీయరేం?
‘తాట తీస్తా.. తోలుతీస్తా..! అని పవన్ అంటున్నారు. పురుషోత్తపట్నం, పట్టిసీమ పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుంటుంటే మరి చంద్రబాబు తాట తీయరేం? అని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ప్రశ్నించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్పి ఆదుకున్న నేత వైఎస్ జగన్ అని గుర్తు చేశారు. ప్రమాదకరమని పోలీసులు వారించినా ఏజెన్సీకి వచ్చి చాపరాయి బాధితులను పరామర్శించి ఆదుకున్నారని చెప్పారు. సమావేశంలో పార్టీ రాజమహేంద్రవరం సిటీ, రూరల్, ప్రత్తిపాడు కో ఆర్డినేటర్లు రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల వీర్రాజు, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, రాజమహేంద్రవరం నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, కార్పొరేటర్లు మేడపాటి షర్మిలారెడ్డి, గుత్తుల మురళీధర్, మజ్జి నూకరత్నం, బొంతా శ్రీహరి, ఈతకోట బాపన సుధారాణి, పిల్లి నిర్మల తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment