ప్రకంపనలు..మీ పార్టీలో రాకుండా చూసుకోండి!  | Lakshman comments on CM KCR | Sakshi
Sakshi News home page

ప్రకంపనలు..మీ పార్టీలో రాకుండా చూసుకోండి! 

Published Sun, Apr 29 2018 4:10 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

Lakshman comments on CM KCR - Sakshi

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: భూప్రకంపనలు ఢిల్లీలో కాదు, ముందు మీ పార్టీలో రాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌లో అంతర్యుద్ధ్దం కొనసాగుతోందని, అది ఎప్పుడు భగ్గుమంటుందో తెలియనిస్థితిలో ఆ పార్టీ ఉందని అన్నారు. ప్రజాసమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరిట డ్రామాలాడుతున్నారని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బీజేపీ ఫోబియా పట్టుకుందని అన్నారు. శనివారం మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం అంకుషాపూర్‌లో నిర్వహించిన గ్రామ స్వరాజ్‌ అభియాన్‌లో ఆయన పాల్గొన్నారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కుటుంబపాలన సాగించే ప్రాంతీయపార్టీలతో ఫెడరల్‌ఫ్రంట్‌ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలకిచ్చిన వాగ్దానాలు, హామీలు నిలబెట్టుకోలేని సీఎం దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు ఎలా తెస్తారని ప్రశ్నించారు.ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో దేశ రాజకీయాలను ఫ్యామిలీఫ్రంట్‌తో భ్రష్టు పట్టిస్తారని విమర్శించారు. దళితున్ని సీఎం చేస్తానని విస్మరించిన, మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించని ముఖ్యమంత్రి దేశ రాజకీయాలను ఎలా ఉద్ధరిస్తారని నిలదీశారు. ఫెడరల్‌ ప్రంట్‌తో ఢిల్లీని గడగడలాడిస్తానని కేసీఆర్‌ చెప్పుకుంటున్నారని, మరి ప్లీనరీకి దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీ నాయకులూ హాజరుకాకపోవడడంపై ఏమంటారో చెప్పాలన్నారు. 

జూన్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బస్సుయాత్ర  
అవినీతి రహితంగా మోదీ ప్రభుత్వం పేదల కోసం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంతోపాటు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి జూన్‌లో బస్సుయాత్ర నిర్వహించనున్నట్లు లక్ష్మణ్‌ తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగనున్న బస్సుయాత్ర విజయవంతానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామ స్వరాజ్‌ అభియాన్‌ పేరుతో దళితవాడల్లో బస, సహపంక్తి భోజనాలు వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేకపోవటంతో రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేయకపోవటంతో నిరుద్యోగ యువత ఆవేదన చెందుతున్నారన్నారు. లంచం లేకుండా ఏ కార్యాలయంలోనూ పనులు కావటం లేదన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొంపెల్లి మోహన్‌రెడ్డి, కిసాన్‌మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి జిల్లాల తిరుమల్‌రెడ్డి, రాష్ట్ర, జిల్లా నాయకులు కప్పర ప్రసాద్‌రావు, కంభం లక్ష్మారెడ్డి, అమరం మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement