సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ పార్టీకి దమ్ముంటే రాష్ట్రమంతా పోటీ చేయా లని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సవాల్ చేశారు. పార్టీ నేతలు చింతా సాంబమూర్తి, సుభాష్, సుధాకర శర్మతో కలసి పార్టీ రాష్ట్ర కార్యాల యంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ కేవలం పాతబస్తీలో ఐదారు సీట్లకు పోటీ చేసి మిగిలిన స్థానాల్లో అధికారంలో ఉన్నవారిని గుప్పిట్లో పెట్టుకోవడం కాద న్నారు. రాష్ట్రమంతా పోటీ చేస్తే మజ్లిస్ నిజస్వరూపం ఏమిటో బయటపడుతుందన్నారు.
రాష్ట్రంలో బీజేపీలోకి హేమాహేమీలైన నాయకులు వస్తున్నారని, వారెవరో, ఏ పార్టీలకు చెందినవారో కూడా త్వరలోనే తెలుస్తుందన్నారు. తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ పాలన ఉందన్నారు. 2022 వరకు నవభారత నిర్మాణం కోసం 6 సూత్రాల ప్రణాళికను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారని వెల్లడించారు. అక్టోబర్ 1 నుంచి 3 దాకా పార్టీ జాతీయనేత రాంలాల్, అక్టోబర్ 14, 15 తేదీల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, 23న సౌదాన్ సింగ్ పార్టీ సంస్థాగత వ్యవహారాల కోసం వస్తారని లక్ష్మణ్ వెల్లడించారు. అక్టోబర్ మూడోవారంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఉంటాయన్నారు.