
సంకల్ప సభలో ప్రసంగిస్తున్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి
తూర్పుగోదావరి, పెద్దాపురం: నమ్మిన మామను వెన్నుపోటు పొడిచి నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావును మోసం చేసి, మొన్నటి ఎన్నికల్లో ప్రజలకు అబద్ధపు హామీలతో అందలమెక్కిన దగాకోరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని నమ్మవద్దని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి చేపట్టి ప్రజా సంకల్ప యాత్ర మూడు వేల మైలురాయి దాటిన సందర్భంగా జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గంలో కో–ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన జగనన్నకు తోడుగా పాదయాత్ర అనంతరం మండలంలోని చంద్రమాంపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజా సంకల్ప సభలో ప్రభుత్వ విధివిధానాలపై నిప్పులు చెరిగారు.
దగాకోరు చంద్రబాబు వల్లే రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. అటు మామ, ఇటు స్నేహితుడైన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిల ఉసురు చంద్రబాబుకు తగలకపోదన్నారు. కో–ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు మాట్లాడుతూ అబద్ధపు హామీలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని, రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం త«థ్యమన్నారు. పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కర్రి వెంకటరమణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఆవాల లక్ష్మీనారాయణ, కంటే వీర్రాఘవరావు, గోపు నారాయణమూర్తిలు మాట్లాడుతూ రాజన్న రాజ్యం రావాలంటే జగన్ సీఎం కావాలన్నారు.