
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు శాసనసభ నియోజకవర్గాల వారీగా తుది ఓటర్ల జాబితాలు అందుబాటులోకి వచ్చా యి. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్దేశించిన గడువు మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలను అధికారిక వెబ్‌సైట్ (http:// ceotelangana.nic.in)లో పొందుపరిచింది. రాష్ట్రంలో గుర్తింపు పొందిన 8 రాజకీయ పార్టీలకు నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాను సాఫ్ట్ కాపీల రూపంలో పొందుపరిచిన హార్డ్‌డిస్క్‌లను పంపిణీ చేయనుంది. ఎన్నికల వ్యూహ రచన, అభ్యర్థుల ఎంపిక, ప్రచార కార్యక్రమాల నిర్వహణలో రాజకీయ పార్టీలకు నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబి తాలు కీలకం కానున్నాయి.
నియోజకవర్గాల్లో ప్రాబల్యం ఉన్న వివిధ వర్గాల ఓటర్లను లక్ష్యం చేసుకుని ఎన్నికల వ్యూహ రచన చేయడం రాజకీయ పార్టీలకు ఆనవాయితీగా మారింది. ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన ఓటర్ల జాబితా రెండో సవరణ కార్యక్రమం కింద తుది జాబితాలను ఈ నెల 12న ప్రకటించినప్పటికీ, నియోజకవర్గాల వారీగా జాబితాలు సిద్ధం కాకపోవడంతో రాజకీయ పార్టీలు కొన్ని రోజులు నిరీక్షించాల్సి వచ్చింది. వెబ్‌సైట్‌లో ఓటర్ల జాబితా నవీకరణ (అప్‌డేటింగ్) ప్రక్రియ సైతం ముగియడంతో ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్న వారు తుది జాబితాలో తమ పేరు ఉందో లేదో ఆన్‌లైన్‌లో తెలుసుకునే అవకాశం లభించింది.
శేరిలింగ్‌పల్లి టాప్.. భద్రాచలం లాస్ట్..
రాష్ట్రంలో శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అత్యధికంగా 5,49,773 మంది ఓటర్లున్నారు. మేడ్చల్ 4,85,202 మంది, ఎల్బీ నగర్ 4,74,599 మంది, కుత్బుల్లాపూర్ 4,68,344 మంది, ఉప్పల్ 4,27,141 మంది, రాజేంద్రనగర్‌లో 4,21,345 మంది ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో మిగతా నియోజకవర్గాలున్నాయి. ఇక భద్రాచలం నియోజకవర్గంలో అతి తక్కువగా 1,33,756 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. రాష్ట్ర పునర్విభజన సమయంలో ఈ నియోజకవర్గం పరిధిలోని 6 మండలాలను ఏపీలో విలీనం చేయడంతో అక్కడి ఓటర్లను సైతం ఏపీలోని నియోజకవర్గాలకు బదిలీ చేశారు. దీంతో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. 1,42,573 మందితో అశ్వారావుపేట, 1,49,688 మందితో బెల్లంపల్లి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
పురుష ఓటర్లే ఎక్కువ!
రాష్ట్రంలోని 67 నియోజకవర్గాల్లో పురుష ఓటర్లు, 52 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 2,73,18,603 ఓటర్లలో 1,37,87,920 పురుషులు, 1,35,28,020 మంది మహిళలు, 2,663 మంది ఇతర ఓటర్లున్నారు.
సోమవారం నుంచి ఓటరు గుర్తింపు కార్డులు..
రాష్ట్రంలో కొత్త ఓటర్లుగా నమోదైన 17,68,873 మందికి సోమవారం నుంచి ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. మీ–సేవ కేంద్రాల్లో రూ.10 ఫీజు చెల్లించి ఓటరు ఫోటో గుర్తింపు కార్డులను కొత్త ఓటర్లు పొందవచ్చని సీఈఓ కార్యాలయ అధికార వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment