
వివరాలు వెల్లడిస్తున్న కలెక్టర్, ఎస్పీ
ఆసిఫాబాద్: లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఎస్పీ మల్లారెడ్డి, ఇతర ఎన్నికల అధికారులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 11న ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు పోలింగ్ ఉంటుందని తెలిపారు. 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక దానితో ఓటు వేసేందుకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ లోక్‌సభ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో 283, ఆసిఫాబాద్‌లో 300 కేంద్రాలు, మొత్తం 583 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. మహిళల కోసం ప్రత్యేకంగా రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తుది ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో 4,02,663 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.
ఇందులో వికలాంగులు 6,388 మంది ఉన్నారన్నారు. ఇప్పటి వరకు 3,87,578 మందికి ఓటరు స్లిప్‌లు పంపిణీ చేశామని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం 1863 మంది సిబ్బందిని నియమించగా, 1276 మందికి ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్లు ఇచ్చామన్నారు. ఈ ఎన్నికల్లో వారు పోస్టల్ బ్యాలెట్ అవసరం లేకుండా నేరుగా విధులు నిర్వహించే పోలింగ్ కేంద్రంలోనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామన్నారు. జిల్లాలోని 96 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నామని, వీటిలో ఆసిఫాబాద్‌లో 37, సిర్‌పూర్‌లో 59 ఉన్నాయన్నారు.
ఆసిఫాబాద్‌లో 28, సిర్‌పూర్‌లో 65 మంది వీడియోగ్రాఫర్లు వీడియో చిత్రీకరణ చేస్తారని కలెక్టర్ వెల్లడించారు. వీరితో పాటు 342 మంది వాలంటీర్లు సైతం ట్యాబ్‌లతో వీడియో రికార్డింగ్ చేయనున్నట్లు తెలిపారు. వికలాంగులకు సహకరించేందుకు 479 మంది ఆశా, అంగన్‌వాడీ కార్యర్తలు సాయం అందిస్తారని, వీరిలో ఆసిఫాబాద్‌లో 262, సిర్‌పూర్‌లో 270 మంది ఉన్నారన్నారు. వికలాంగులను తరలించేందుకు 464 వీల్‌చైర్లు అందుబాటులో ఉంచామని, వీటిలో ఆసిఫాబాద్‌లో 252, సిర్‌పూర్‌లో 212 ఉన్నాయన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాల్లో తాత్కాలికంగా నీడ వసతి, తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే వారికి అవసరమైన ప్రతి సామగ్రిని పంపిణీ చేస్తామన్నారు. ఎన్నికల నిబంధనలు అమలు చేసేందుకు ఇప్పటికే జిల్లాలో ఎంసీఎంసీ కమిటీ పని చేస్తుందన్నారు.
ఎస్పీ మల్లారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని 583 పోలింగ్ కేంద్రాల పరిధిలో 74 సమస్యాత్మక, వామపక్ష తీవ్రవాదమున్న 60 పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక అదనపు బలగాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే చెక్‌పోçస్టుల వద్ద ముమ్మర తనిఖీలు చేస్తున్నట్లు, గతంలో విధులకు ఆటంకం కలిగించిన వారిని బైండోవర్‌లు, లైసెన్సు కలిగి ఉన్న ఆయుధాలు డిపాజిట్ చేయించామన్నారు.
పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు సివిల్, ఆర్మ్‌డ్ ఫోర్స్, హర్యాణా పోలీసులు, ఫారెస్టు, ఆర్టీసీ, లీగల్ మెట్రాలజీ శాఖల నుంచి సిబ్బందిని వినియోగించుకుంటున్నట్లు వెల్లడించారు. మొత్తం 1218 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పోలీస్‌శాఖ అన్నిచర్యలు తీసుకుంటుందని వివరించారు. ఈ సందర్భంగా ఈవీఎం, వీవీప్యాట్‌ల ద్వారా ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించే పోస్టర్‌ను కలెక్టర్, ఎస్పీ విడుదల చేశారు. ఈ సమావేశంలో ఎన్నికల అధికారి విజయలక్ష్మి, డీపీఆర్‌వో తిరుమల పాల్గొన్నారు.