సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. కాంగ్రెస్ సహా ప్రధాన విపక్షాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించినా.. సభలో బీజేపీకి పూర్తి మెజార్టీ ఉండడంతో బిల్లుకు ఆమోదం లభించింది. సిటిజన్‌షిప్ బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. పౌరసత్వ సవరణ బిల్లు కేవలం అసోం రాష్ట్రం కోసం కాదని... పొరుగు దేశాల నుంచి భారత్‌కు వచ్చే శరణార్థులందరి కోసమని స్పష్టంచేశారు. ఈ బిల్లుతో ఎవరూ వివక్షకు గురికారని తెలిపారు. ఈ విషయంలో ఈశాన్య రాష్ట్రాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. అసోం ప్రజల హక్కులను ప్రభుత్వం ఎల్లప్పుడూ కాపాడుతుందని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.
పౌరసత్వ సవరణ బిల్లుపై ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఈ సవరణ వల్ల అసోంలో పెద్దఎత్తున అల్లర్లు జరుగుతాయని, దీన్ని మరోసారి సెలెక్ట్ కమిటీకి పంపించాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. ఇందుకు స్పీకర్ సుమిత్రా మహజన్ నిరాకరించారు. దీంతో ప్రభుత్వం తీరుకు నిరసనగా కాంగ్రెస్ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. అటు తృణమూల్ కాంగ్రెస్ కూడా పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించింది. బిల్లు ఆమోదం పొందితే అసోం సహా ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటాయని తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ హెచ్చరించారు. అయితే, విపక్షాల ఆందోళన మధ్యే పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో ఈశాన్యరాష్ట్రాల్లో ఆందోళనలు భగ్గుమన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment