దిబ్రూగఢ్: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 300కు పైగా సీట్లు సాధించి వరుసగా మూడోసారి అధికారంలోకి రాబోతున్నామని ధీమా వెలిబుచ్చారు. అస్సాంలోని దిబ్రూగఢ్‌లో అప్పర్ అస్సాం జోనల్ బీజేపీ కార్యాలయ నిర్మాణానికి అమిత్ షా మంగళవారం పునాదిరాయి వేశారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రసంగించారు.
అస్సాంలో 14 లోక్‌సభ స్థానాలు ఉండగా, వచ్చే ఎన్నికల్లో తాము 12 స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకప్పుడు కాంగ్రెస్ బలంగా ఉండేదని, ఇప్పుడు ఆ పార్టీ నామమాత్రంగా మారిపోయిందని అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదని, ఇటీవల ఈశాన్యంలో జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయిందని గుర్తుచేశారు. ఈశాన్యంలో తమకు అధికారం కట్టబెట్టిన తొలి రాష్ట్రం అస్సాం ప్రజలకు అమిత్ షా కృతజ్ఞతలు తెలియజేశారు.
అస్సాంలో శాంతి సౌభాగ్యాలు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై దేశాన్ని అవమానించారని అమిత్ షా మండిపడ్డారు. ఇలాగే చేస్తే కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతోందని అన్నారు. ప్రధాని మోదీని కొందరు ఇష్టారాజ్యంగా దూషిస్తున్నా ప్రజల ఆశీస్సులు ఆయనకు లభిస్తున్నాయన్నారు. మోదీ బాగుండాలని ప్రజలంతా ప్రార్థిస్తున్నారని తెలిపారు. అస్సాం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. రాష్ట్రంలో 70 శాతం భూభాగం నుంచి వివాదాస్పద సైనిక దళాల (ప్రత్యేక అధికారాల) చట్టం–1958ను తొలగించామని పేర్కొన్నారు. అస్సాం అనగానే ఆందోళనలు, ఉగ్రవాదం గుర్తుకొచ్చేవని, ప్రస్తుతం శాంతి సౌభాగ్యాలు పరిఢవిల్లుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment