
అనర్హత వేటు వ్యవహారంలో నవంబర్‌లో తుది విచారణకు మద్రాసు హైకోర్టు నిర్ణయించింది. ఆ నెల రెండో తేదీ నిర్ణయాన్ని తుది విచారణ అంటూ అదనపు పిటిషన్లు, వివరణలన్నీ ఈనెల 13వ తేదీలోపు ముగించాలని ప్రభుత్వానికి, పిటిషనర్లకు న్యాయమూర్తి రవిచంద్ర బాబు ఆదేశాలు ఇచ్చారు.
సాక్షి, చెన్నై : సీఎం పళని స్వామికి వ్యతిరేకంగా వ్యవహరించిన అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలు 18 మందిపై అనర్హత వేటు పడ్డ విషయం తెలిసిందే. ఈ వేటును వ్యతిరేకిస్తూ ఆ 18 మంది మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో తమకు న్యాయం లభిస్తుందనే ఎదురుచూపులతో అనర్హత వేటు పడ్డ వారు ముందుకు సాగుతున్నారు. ఈ పిటిషన్ గత వారం న్యాయమూర్తి రవిచంద్ర బాబు నేతృత్వంలోని బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ తరఫున వివరణతో కూడిన పిటిషన్ ఆ రోజున దాఖలైంది. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్ధం కావడంతోనే అనర్హత వేటు వేసినట్టుగా అందులో వివరించారు. ఈ నేపథ్యంలో సోమవారం న్యాయమూర్తి రవిచంద్ర బాబు ముందు ఆ పిటిషన్ విచారణకు వచ్చింది.
నవంబర్ 2న తుది విచారణ
పిటిషనర్ల తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ హాజరై వాదనల్ని వినిపించారు. అనర్హత వేటు పడ్డ వారి తరఫున అదనపు పిటిషన్లు దాఖలు చేసినట్టు వివరించారు. ఇందుకు ప్రభుత్వం తరఫున న్యాయవాది వైద్యనాథన్ హాజరై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. అదనపు పిటిషన్లకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా, మరింత సమయాన్ని కేటాయించాలని కోరారు. ఈ సమయంలో అభిషేక్ సింఘ్వీ, వైద్యనాథన్ మధ్య వాడి వేడిగా వాదనలు సాగాయి. విచారణ త్వరితగతిన ముగించాలని, పిటిషనర్లకు న్యాయం చేయాలని బెంచ్‌ను సింఘ్వీ కోరారు. చివరకు వాదనల అనంతరం న్యాయమూర్తి రవిచంద్ర బాబు జోక్యం చేసుకుని, తుది విచారణ నవంబర్ రెండో తేదీన జరుగుతుందని ప్రకటించారు. అదనపు పిటిషన్లు, వివరణలన్నీ ఈనెల 13వ తేదీలోపు ముగించాలని ఆదేశించారు. నవంబర్ రెండున తుది విచారణ తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తామంటూ, అప్పటివరకు బల పరీక్ష వ్యవహారంలో స్టే కొనసాగుతుందని ప్రకటించారు. తదుపరి విచారణను వాయిదా వేశారు. కాగా, అనర్హత వేటుపై కోర్టులో విచారణ మరికొన్ని వారాలకు వాయిదా పడ్డ దృష్ట్యా, నిర్ణయం కోసం ఆ 18 మంది మరి కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.
ఆస్పత్రిలో తంగ తమిళ్ సెల్వన్
అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న తంగ తమిళ్ సెల్వన్ అనారోగ్యం బారిన పడ్డారు. గత కొంత కాలంగా క్యాంప్ రాజకీయాలతో పుదుచ్చేరి, బెంగళూరుల్లో తంగతమిళ్ సెల్వన్ తిష్ట వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వేటు పడడంతో మళ్లీ రాష్ట్రంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఆయన అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి తీవ్రత మరీ ఎక్కువ కావడంతో కుటుంబీకులు, సహచరులు చికిత్స నిమిత్తం గ్రీమ్స్ రోడ్డులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో మరి కొద్ది రోజులు ఉండి చికిత్స పొందాల్సి ఉన్నట్టు వైద్యులు ఆయనకు సూచించారు. దీంతో తంగ తమిళ్ సెల్వన్‌ను పలువురు అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు, దినకరన్ మద్దతు నాయకులు పరామర్శించే పనిలో పడ్డారు