
సాక్షి, హైదరాబాద్: మహాకూటమి తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని మార్చివేసిందని టీజేఎస్ చైర్మన్ కోదండరాం అన్నారు. పొత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. శనివారం టీజేఎస్ పార్టీ కార్యాలయంలో ఎన్‌ఐఏ కోర్టు రిటైర్డు జడ్జి రవీందర్‌రెడ్డి టీజేఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రంలో మహాకూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. నిరుద్యోగులు, ఉద్యోగులతో పాటు అన్ని వర్గాలు మహాకూటమికి మద్దతుగా ఉన్నాయన్నారు. సీట్ల సర్దుబాటుపై చర్చలు వేగవంతమయ్యాయని, సీట్లపై ఇవాళో, రేపో స్పష్టత వస్తుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. దసరా నుంచి ప్రచారం ప్రారంభించాలనుకుంటున్నామన్నారు. జడ్జి రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ఒక్కరు ఉద్యమిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదని, సుమారు 1,600 మంది ఉద్యమంలో అమరులయ్యారన్నారు.