
సాక్షి, హైదరాబాద్: ఆత్మగౌరవం కోసం జరిగిన పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో నిరంకుశపాలన సాగుతోందని, ఇక్కడ అవమానాలకే తప్ప ఆత్మగౌరవానికి తావు లేదని తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధినేత ప్రొఫెసర్ ఎం.కోదండరాం వ్యాఖ్యానించారు. ప్రశ్నించడమనే ప్రాథమిక హక్కునే టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాలరాస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు దూరంగా, నియంతృత్వ చట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలిస్తున్నాడని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదమని హెచ్చరించారు. పరిపాలనలో ప్రభుత్వ మంచి, చెడులను చర్చించుకోవడానికి అవకాశం ఉండాలని అభిప్రాయపడ్డారు. ఒత్తిడి పెంచడం, ప్రశ్నించడం ద్వారా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను సాధించుకునే అవకాశం లేకపోవడంతోనే టీజేఎస్ పుట్టుక అనివార్యమైందని, ఉద్యమ ఆకాంక్షల సాధన, ప్రజాస్వామిక పాలనే తమ అంతిమ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, టీఆర్‌ఎస్ వైఫల్యాలు, ప్రత్యామ్నాయ మార్గాలు, ఐక్య ఫ్రంట్‌కు సంబంధించిన అంశాలపై ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలివీ!
సాక్షి: ముందస్తు ఫలితాలు ఎలా ఉంటాయని విశ్లేషిస్తున్నారు?
కోదండరాం: తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని టీఆర్‌ఎస్‌కు ఐదేళ్ల పాటు ప్రజలు అధికారాన్ని ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన మరునాటి నుంచే ఉద్యమ ఆకాంక్షలను సీఎంగా కేసీఆర్ పూర్తిగా విస్మరించారు. టీఆర్‌ఎస్‌ను ఫక్తు రాజకీయ పార్టీగా ప్రకటించి, రాజకీయ ప్రయోజనాలకే పాలనను పరిమితం చేశారు. ఉద్యమకారులను అన్నిరంగాల్లో అవమానించారు. ఉద్యమాలు చేస్తున్నవారిని కట్టెలతో కొట్టినవారికే ఇప్పుడు అధికార దండాన్ని అప్పగించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నో హామీలను అమలు చేయలేదు. హామీలను అమలు చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకుని, రాజకీయాల్లో వేడిని పుట్టించడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్ ముందస్తు ఎత్తు వేశారు. సహజంగానే రాజకీయ చైతన్యం ఉన్న తెలంగాణ ఉద్యమం ద్వారా ప్రజలకు ప్రశ్నించే చైతన్యం వచ్చింది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు, యువకులు అవగాహన చేసుకున్నారు. హామీలను అమలు చేయకుండానే అసెంబ్లీని ఎందుకు రద్దు చేశారని ప్రశ్నిస్తున్నారు. ముందస్తు అవసరమేంటని ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పలేకపోతున్నారు. ముందస్తు ఎన్నికలతో మరోసారి అధికారంలోకి రావాలనే కేసీఆర్ తపనను అన్ని స్థాయిల్లో ప్రశ్నిస్తున్నారు. ముందస్తుతో టీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు నష్టమే ఎక్కువ. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ముందస్తు ఎత్తుగడతో టీఆర్‌ఎస్ మునిగిపోక తప్పదు.
టీఆర్‌ఎస్ ఏయే రంగాల్లో వైఫల్యం చెందింది?
నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు ఆత్మగౌరవం కోసం తెలంగాణలోని సబ్బండ వర్ణాలు ఏకమై పోరాడినయి. ఇప్పటిదాకా ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేదు. అదనంగా ఒక్క ఎకరమూ నీటితో పారలేదు. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేయలేదు. ఉపాధికల్పనలోనూ టీఆర్‌ఎస్ నిర్లక్ష్యం చేసింది. అవమానాలకు తప్ప ఆత్మగౌరవం అనే దానికి టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవకాశమే లేకుండా పోయింది. చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం వంటి వాటికి గౌరవం లేదు. విచ్చలవిడిగా అధికారాన్ని ఉపయోగిస్తున్నారు. ఒక కుటుంబం చుట్టే పరిపాలన, అధికారం అంతా కేంద్రీకృతమైంది. వనరులన్నీ ఒక కుటుంబమే కొల్లగొడుతోంది. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంబంధాలు తెగిపోయాయి. ప్రజల పట్ల బాధ్యత లేకుండా పాలన ఉంది. ఒక కుటుంబ అవసరాలు, ప్రయోజనాలకే ప్రభుత్వం, పాలనా యంత్రాంగ పరిమితమైంది. కేసీఆర్ కుటుంబ ప్రయోజనాలు తప్ప ప్రజల పట్ల బాధ్యతలేకుండా పాలన కొనసాగింది.
టీఆర్‌ఎస్ పాలనపై విమర్శలు చేస్తున్నారు కదా..! మీరు సూచిస్తున్న ప్రత్యామ్నాయ అభివృద్ధి ప్రతిపాదనలేమిటి?
ఉపాధికల్పన కీలకమైన అంశం. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాకపోయినా ఉపాధి, ప్రతి చేతికీ పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఖాళీగా ఉన్న ప్రభుత్వ, ప్రభుత్వరంగ ఉద్యోగాలను సత్వరమే భర్తీ చేస్తాం. దీనికోసం ఉద్యోగాల భర్తీకి కేలండర్‌ను విడుదల చేస్తాం. వ్యవసాయ, ఆ రంగ ఆధారిత సెక్టార్‌లో ఉపాధి అవకాశాలను పెంచాలి. ఆధారపడిన దగిన ఆదాయం పొందడానికి అవసరమైన నైపుణ్య శిక్షణ అందాలి. చిన్న, సూక్ష్మ పారిశ్రామిక రంగం ద్వారా విస్తృతంగా ఉపాధి అవకాశాలు పెంచాలి. పరిశ్రమల్లో స్థానికులకు అవకాశం ఇవ్వాలి. దైనందిన జీవితానికి ఉపయోగపడే రంగాల్లో నైపుణ్యం పెంచడానికి సుశిక్షితులను చేయాలి. విద్య, వైద్యరంగాల్లో మౌలిక వసతులను పెంచడమే కాకుండా పేదలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ప్రభుత్వ సొమ్ము అన్నివర్గాలకు, ప్రధానంగా అట్టడుగు వర్గాలకు అందాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్ పటిష్టంగా అమలుచేయాలి. వ్యవసాయ రంగంలో రైతులకు లాభదాయకమైన మార్గాలను అమలుచేయాలి. వీటిపై సీఎం కేసీఆర్‌కు చెప్పాలని ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు.
తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్‌తో సన్నిహితంగా ఉండేవారు. మీ ఇద్దరికి వైరం ఎలా ఏర్పడింది?
తెలంగాణ కోసం జేఏసీ నిర్వహించిన మిలియన్ మార్చ్, సాగరహారం వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలతో పాటు అనుసరించాల్సిన వ్యూహాలపైనా భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఉద్యమ కాలంలోనూ అంతర్గత చర్చలు, విబేధాలున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ప్రజాసంఘాలు, ఉద్యోగసంఘాలు, సామాజిక సంఘాలు జేఏసీలో భాగంగా పనిచేశాయి. రాజకీయ పార్టీలు కూడా జేఏసీ ఉన్నాయి.. రాష్ట్రం సాధించాలనే తపనలో కొన్నిసార్లు చాలా ప్రమాదకరమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వచ్చింది. మిలియన్ మార్చ్, సాగరహారం, సకల జనుల సమ్మె వంటి భారీ కార్యక్రమాల సందర్భంలోనూ చర్చలు, భిన్నాభిప్రాయాలు తలెత్తాయి, తెలంగాణ ఏర్పాటై, టీఆర్‌ఎస్ ఫక్తు రాజకీయ పార్టీగా మారి, కేసీఆర్ సీఎం అయిన తర్వాత అసహనం పెరిగింది. ప్రశ్నించే తత్వాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేనని తన చేతల ద్వారా చూపించారు. ఉద్యమ ఆకాంక్షలు, ప్రజల కోసం విజ్ఞప్తులు, ఒత్తిళ్లు, పోరాట కార్యాచరణ చేపట్టాల్సి వచ్చింది. కేసీఆర్ నిరంకుశ, అప్రజాస్వామిక ధోరణి, ప్రజాస్వామిక హక్కులను అణిచేయాలనే వైఖరే వైరానికి కారణం. ప్రజాస్వామ్య గొంతును నొక్కాలని కేసీఆర్ ప్రయత్నం, ప్రతిఘటించే పోరాటంతో వైరం పెరిగినట్టుంది. ఇవి తప్ప వ్యక్తిగత అంశాలేమీ లేవు.
టీఆర్‌ఎస్ ముఖ్యులెవరైనా మాట్లాడుతున్నారా?
టీఆర్‌ఎస్ ముఖ్యులే కాకుండా అధిపత్యం కోసం కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. వీటి ప్రభావం పార్టీలో తీవ్రంగా ఉంది. నిరంకుశ చర్యలతో ఆ పార్టీలోని ముఖ్యులు మాట్లాడుతున్నారు. ఆ చర్చలు వివిధ స్థాయిల్లో ఉన్నాయి.
ఉద్యమంలో జేఏసీకి, ఇప్పుడొక రాజకీయ పార్టీకి (టీజేఎస్‌కు) నేతృత్వం వహించడంలో తేడా ఏంటి?
ఉద్యమంలో తెలంగాణ సాధన ఒక్కటే తక్షణావసరం.. అదే అంతిమ లక్ష్యం. రాజకీయ పార్టీకి రాజకీయ అవసరాలుంటాయి. రాజకీయ పార్టీ లక్ష్యాలు, యంత్రాంగం, ప్రాతిపదిక వంటి ఎన్నో అంశాలు వీటిలో అంతర్భాగం. ఇదొక కఠినమైన పరిధి. అయినా సాధించుకుంటాం.
ఒంటరిగా వెళ్లడానికి టీజేఎస్ ఎందుకు వెనుకాడుతోంది?
అదేమీ లేదు. తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షలు, టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలు తెలంగాణలో అమలు కాలేదు. కేసీఆర్ నిరంకుశ, అప్రజాస్వామిక పాలనతో విసిగిపోయిన క్షేత్రస్థాయి ప్రజలే అన్నిపార్టీలు ఏకమై ఫ్రంటు కావాలని కోరుతున్నరు. రాజకీయ ప్రయోజనాలు, సీట్లు మాత్రమే కాకుండా ఉద్యమ ఆకాంక్షల సాధన ప్రాతిపదికగా, ప్రజల ఎజెండాను మేనిఫెస్టోగా చేసుకోవాలని అన్నివర్గాలు ఒత్తిడి తెస్తున్నాయి. టీఆర్‌ఎస్ లాంటి నియంతృత్వ పార్టీ అధికారంలోకి వస్తే భవిష్యత్తులో ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుందని ఆందోళనతోనే ఒత్తిళ్లు వస్తున్నాయి. దీనికి అనుగుణంగానే ఉమ్మడి మేనిఫెస్టోపై కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ, టీజేఎస్‌లు అంగీకారానికి వచ్చాయి. ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించడం, దాని అమలు కోసం యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం, దానికి చట్టబద్దత కల్పించడం వంటి వాటికి అన్ని పార్టీలు అంగీకరించాయి. ఈ ఫ్రంట్ మేనిఫెస్టోను త్వరలోనే ప్రకటిస్తాం.
టీడీపీ వంటి తెలంగాణ వ్యతిరేక పార్టీలతో ఉద్యమ ఆకాంక్షలు ఎలా సాధిస్తారు?
పార్టీల సొంత ఎజెండాలు ఏమైనా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలే ఏకైక ప్రాతిపదికగా ఈ ఫ్రంట్‌లో భాగస్వామిగా ఉంది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, ప్రజల ఎజెండా మాత్రమే టీజేఎస్‌కు ప్రాతిపదిక. వీటికి మించి మాకు ఏవీ ముఖ్యం కాదు. ఈ ఫ్రంట్‌లో భాగస్వామిగా టీజేఎస్ ఉంటుంది తప్ప ఏ పార్టీలో చేరడం లేదు. ప్రజల ఎజెండా అమల్లో చిన్న లోపం జరిగినా టీజేఎస్ అంగీకరించదు. ఉమ్మడి మేనిఫెస్టో అమలుకు అన్ని పార్టీలు అంగీకరించాకే మిగిలిన ఏ అంశమైనా చర్చకు వస్తుంది.
ఈ ఫ్రంట్‌లో ఏ పార్టీ ఎన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తుంది?
ఇంకా సీట్లపై చర్చ జరగలేదు. ప్రజల ఎజెండా, ఉద్యమ ఆకాంక్షలతో కూడిన మేనిఫెస్టోపై కసరత్తు పూర్తి కావస్తోంది. ప్రజల ఎజెండాయే ఈ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రాతిపదిక. సీట్లు, పోటీ వంటివి భాగం మాత్రమే. ఈ ఫ్రంట్‌లో పెద్ద భాగస్వామి అయిన కాంగ్రెసే అన్ని అంశాలపై సరైన నిర్ణయాలు తీసుకుని, ఫ్రంట్‌ను నిలబెట్టడానికి బాధ్యత వహించాలి. చొరవ తీసుకుని, వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజల్లోని అన్ని వర్గాల సమష్టి ప్రయోజనాల కోసం టీజేఎస్ పనిచేస్తుంది.
మీరు ఎక్కడి నుంచి పోటీచేస్తారు?
నా పోటీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పోటీచేయాలని ఐదారు నియోజకవర్గాల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. విశాల ప్రయోజనాల కోసం పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. పోటీచేయాలా.. వద్దా.. ఎక్కడ్నుంచి పోటీ చేయాలనే దానిపై పార్టీదే తుది నిర్ణయం. వ్యక్తిగత నిర్ణయాలకు తావు లేదు. పార్టీకి, ఫ్రంట్‌కు ఏది లాభమో, అ నిర్ణయమే తీసుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment