ముంబై: మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కూటమి ‘మహారాష్ట్ర వికాస్ అఘాడి’ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చురుగ్గా జరుగుతున్నాయి. పదవులు పంపకంపై మూడు పార్టీలు అంగీకారానికి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. శివసేనకు ముఖ్యమంత్రితో పాటు 15 మంత్రి పదవులు లభించాయి. ఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రితో పాటు 13 కేబినెట్ బెర్త్‌లు దక్కాయి. కాంగ్రెస్‌కు స్పీకర్‌తో పాటు 13 మంత్రి పదవులు లభించినట్టు తెలుస్తోంది. వైబీ చవాన్ భవన్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ భేటీలో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌లతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అహ్మద్ పటేల్, మాణిక్‌రావ్ ఠాక్రే పాల్గొన్నారు. మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపుపైనా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది.
‘మహారాష్ట్ర వికాస్ అఘాడి’ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా గురువారం శివాజీ పార్క్‌లో ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ను ఆహ్వానించినట్టు కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివర్ తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని తమ ఎమ్మెల్యేలను ఆదేశించినట్టు ఎన్సీపీ నేత అజిత్ పవార్ వెల్లడించారు.
400 మంది రైతు కుటుంబాలకు ఆహ్వానం
ఆత్మహత్య చేసుకున్న 400 మంది రైతు కుటుంబాలను తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉద్ధవ్ ఠాక్రే ఆహ్వానించారు. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్) అధినేత రాజ్ ఠాక్రేకూ ఆహ్వానం పంపారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తామని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ తెలిపారు. (చదవండి: సుప్రియ.. తండ్రికి తగ్గ తనయ)
Comments
Please login to add a commentAdd a comment