ముంబై: మహారాష్ట్రలో బీజేపీ ఆట ముగిసిందని ఎన్సీపీ ముఖ్య అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ వ్యాఖ్యానించారు. బుధవారం సాయంత్రంలోపు శాసనసభలో బలం నిరూపించుకోవాలని బీజేపీని సుప్రీంకోర్టు ఆదేశించడంతో మాలిక్ స్పందించారు. ‘సత్యం గెలిచింది. బీజేపీ ఆట ముగిసింద’ని హిందీలో ట్వీట్ చేశారు. అజిత్ పవార్ వెంట వెళ్లిన ఎన్సీపీ ఎమ్మెల్యేలు అందరూ తిరిగొచ్చారని అంతకుముందు ఆయన తెలిపారు.
సుప్రీంకోర్టు తీర్పు పట్ల కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కూటమి సంతృప్తిగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్విరాజ్ చవాన్ అన్నారు. రాజ్యాంగం దినోత్సవం నాడు రాజ్యాంగాన్ని గౌరవించే తీర్పును సుప్రీంకోర్టు వెలువరించిందని ఆయన వ్యాఖ్యానించారు. తమ కూటమి అసెంబ్లీలో బలం నిరూపించుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ అసలు రంగు రేపు బయట పడుతుందని అన్నారు. తమ కూటమికి 162 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ ఇప్పటికే ప్రకటించాయి.
సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని, విశ్వాస పరీక్షకు సిద్ధంగా ఉన్నామని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ అన్నారు. అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని, హోటల్‌లో కాదని బీజేపీ నాయకుడు రాంమాధవ్ వ్యాఖ్యానించారు. (చదవండి: డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవర్ రాజీనామా)
Comments
Please login to add a commentAdd a comment